Delhi: హౌతి క్షిపణి దాడులు.. 21 మందిని రక్షించిన భారత్
ABN , Publish Date - Mar 07 , 2024 | 02:53 PM
ఎర్ర సముద్రంలో పట్టు కోసం హౌతీ మిలిటెంట్లు జరుపుతున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం సాయంత్రం ఓ నౌకపై హౌతీ మిలిటెంట్లు దాడులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని గుర్తించిన భారత నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా.. ఒక భారతీయ పౌరుడితో సహా 21 మందిని సురక్షితంగా రక్షించింది.
ఢిల్లీ: ఎర్ర సముద్రంలో పట్టు కోసం హౌతీ మిలిటెంట్లు జరుపుతున్న దాడుల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం సాయంత్రం ఓ నౌకపై హౌతీ మిలిటెంట్లు దాడులు జరపగా.. ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వారిని గుర్తించిన భారత నేవీ యుద్ధ నౌక ఐఎన్ఎస్ కోల్‌కతా.. ఒక భారతీయ పౌరుడితో సహా 21 మందిని సురక్షితంగా రక్షించింది. యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల నుంచి క్షిపణి నౌక ఢీ కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు.
యెమెన్‌లోని ఓడరేవు నగరం ఏడెన్‌కు నైరుతి దిశలో 101 కి.మీ. దూరంలో ఈ సంఘటన జరిగింది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌లో సముద్ర భద్రతా కార్యకలాపాల కోసం మోహరించిన INS కోల్‌కతా ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సాయం అందించింది. INS కోల్‌కతా సాయంత్రం 4:45 గంటలకు చేరుకుని వేగంగా రెస్క్యూను నిర్వహించిందని నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు.
తీవ్రంగా గాయపడిన వారితో సహా సిబ్బందికి అవసరమైన వైద్య సాయం అందించినట్లు చెప్పారు. రెస్క్యూ విజయవంతమయ్యాక గాయపడిన వారితో పాటు మొత్తం 21 మంది సిబ్బందిని అదే రోజు జిబౌటికి తరలించారు.
ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్ల దాడులకు సంబంధించి ప్రపంచవ్యాప్త ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఘటన చోటు చేసుకుంది. కొన్ని వారాలుగా ఈ దాడులు జరుగుతున్నాయి. పశ్చిమ హిందూ మహాసముద్రంలోని వివిధ వాణిజ్య నౌకలకు సహాయం అందించడంలో భారత నౌకాదళం చురుకుగా పాల్గొంటోంది.