ఇజ్రాయెల్ ప్రతీకారం
ABN, Publish Date - Oct 27 , 2024 | 03:19 AM
ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది.
ఇరాన్‌పై 100 యుద్ధ విమానాలతో దాడి
తెల్లవారుజామున 3 నగరాలపై 3 గంటల పాటు
టెహ్రాన్, ఇలం, ఖుజెస్థాన్ సైనిక స్థావరాలే లక్ష్యం
క్షిపణి, డ్రోన్ తయారీ, ప్రయోగ కేంద్రాలే టార్గెట్
తొలుత ఇరాన్ రేడార్, ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం
పకడ్బందీగా ‘డేస్ ఆఫ్ రెపెంటెన్స్’ ఆపరేషన్
ఇద్దరు సైనికుల మృతి.. ప్రతిదాడి తప్పదు: ఇరాన్
ప్రపంచదేశాల మిశ్రమ స్పందన
టెహ్రాన్, టెల్‌అవీవ్, బీరుట్, అక్టోబరు26: ఈ నెల ఒకటిన 180కిపైగా భారీ బాలిస్టిక్ క్షిపణులతో తమపై విరుచుకుపడిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ 25 రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది. సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్‌లోని 20 లక్ష్యాలపై వైమానిక దాడులతో విరుచుకుపడింది. శనివారం రాత్రి రెండు గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకూ మూడు గంటల పాటు వంద యుద్ధవిమానాలతో ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు ఇలం, ఖుజెస్థాన్‌లలోని క్షిపణి, డ్రోన్ తయారీ, ప్రయోగ కేంద్రాలు, సైనిక స్థావరాలపై అత్యాధునిక ఎఫ్-35 యుద్ధ విమానాలతో బీభత్సం సృష్టించింది. తొలుత ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను దెబ్బతీసి ఆ తర్వాత క్షిపణి తయారీ కర్మాగారాలపై ఏకధాటిగా బాంబులు కురిపించిన విమానాలు తిరిగి సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నాయి. అనంతరం ఇరాన్‌పై తమ ‘డేస్ ఆఫ్ రెపెంటెన్స్’ ఆపరేషన్ ముగిసిందని ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియల్ హగరి ప్రకటించారు. ఇరాన్ ప్రతిదాడి చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడికి ముందే ఇజ్రాయెల్ అమెరికాకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఇరాన్‌పై దాడిలో నలుగురు మహిళా పైలట్లు పాల్గొన్నారు.
ప్రతిదాడి చేస్తామన్న ఇరాన్
గాఢ నిద్రలో ఉండగా ఇజ్రాయెల్ ఒక్కసారిగా జరిపిన దాడులతో ఇరాన్ ఉలిక్కిపడింది. ఇంతలోనే తేరుకుని.. ఇజ్రాయెల్ వైమానిక దాడులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోవడం వల్లే నష్టం పరిమిత స్థాయిలో జరిగిందని తెలిపింది. దాడుల్లో తమ దేశానికి చెందిన ఇద్దరు సైనికులు అమరులయ్యారని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్‌పై ప్రతిదాడి తప్పదని, సరైన సమయంలో దాడి చేస్తామని తెలిపింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునే విషయంలో హద్దులు చూడకుండా, ఎందాకైనా వెళ్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ స్పష్టం చేశారు. వాస్తవానికి తాము అక్టోబరు ఒకటిన జరిపిన దాడికి ఇజ్రాయెల్ తప్పకుండా ప్రతిదాడి చేస్తుందని ఊహించిన ఇరాన్ ముందస్తుగా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను సిద్ధం చేసుకుంది. వైమానిక దళాలను కూడా అప్రమత్తం చేసింది. అయినా ఊహించని రీతిలో ఇజ్రాయెల్ అర్ధరాత్రి వేళ మెరుపుదాడి చేసింది.
పరిమిత దాడితో సరిపెట్టిన ఇజ్రాయెల్
ఇరాన్‌లోని చమురు క్షేత్రాలు, అణు స్థావరాల జోలికి పోకుండా ఇజ్రాయెల్ వూహాత్మకంగా వ్యవహరించింది. కేవలం సైనిక స్థావరాలు, క్షిపణి, డ్రోన్ తయారీ కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది. దీంతో పౌరులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తపడింది. అమెరికా ఎన్నికల వేళ కావడంతో ఇజ్రాయెల్ చమురు క్షేత్రాలను లక్ష్యం చేసుకోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. చమురు క్షేత్రాలను లక్ష్యంచేసుకుంటే చమురు ధరలు పెరిగి అమెరికా, యూరప్ దేశాలకు సంకటంగా మారే అవకాశం ఉండటంతో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ సంయమనం పాటించిందని చెబుతున్నారు.
‘ఆపరేషన్ ఒపేరా’ను గుర్తు చేసిన తాజా దాడి
ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిని ఇరాక్‌పై 1981లో జరిపిన ‘ఆపరేషన్ ఒపేరా’ను గుర్తు చేసింది. 1981 జూన్ ఏడున ఇరాక్‌లో 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్‌ను ఇజ్రాయెల్ ఎఫ్-16ఏ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి. జూన్ 7న సాయంత్రం 4 గంటలకు ఆపరేషన్ ప్రారంభించి గంటన్నరలో అంటే ఐదున్నరకల్లా టార్గెట్‌ను ధ్వంసం చేసి ఎదురుదాడిని తప్పించుకుని సురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నాయి. ఇరాన్‌పై తాజా దాడిని కూడా ఐడీఎఫ్ అత్యంత చాకచక్యంగా నిర్వహించింది. 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ లక్ష్యాలపై ఎఫ్-35 యుద్ధ విమానాలు 3 గంటల పాటు బాంబుల వర్షం కురిపించిసురక్షితంగా ఇజ్రాయెల్ చేరుకున్నాయి. కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడి నేపథ్యంలో హెజ్‌బొల్లా కన్నెర్ర చేసింది. ఇజ్రాయెల్ హైఫా సమీపంలోని క్రయోట్‌లో ఉన్న జనావాసాలపై రాకెట్ల వర్షం కురిపించింది.
ఇజ్రాయెల్ దాడిపై దేశాల మిశ్రమ స్పందన
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతిదాడిపై ప్రపంచదేశాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. దాడిని కొన్ని దేశాలు ఖండించగా మరికొన్ని సమర్థించాయి.
అన్ని వర్గాలు సంయమనం పాటించాలి. చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కారానికి యత్నించాలి - భారత్
తమ పౌరుల ఆత్మరక్షణార్థం దాడి జరిపేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. తాజా ఆపరేషన్‌లో మేము పాల్గొనలేదు. ఇరాన్ ప్రతిదాడి జరపకపోవడమే మంచిది - అమెరికా
ఇరాన్ దురాక్రమణనుంచి తనను తాను రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. ఇరాన్ ప్రతిదాడి ఆలోచనలు చేయవద్దు - బ్రిటన్
ఉద్రిక్తతలను పెంచే చర్యలు ఇరాన్ చేపట్టవద్దు. అప్పుడే మధ్యప్రాచ్యంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి - జర్మనీ
ఉద్రిక్తతలు పెరగకుండా అన్ని పక్షాలూ సంయమనం పాటించాలి
- ఫ్రాన్స్
దాడి ఆందోళన కలిగిస్తోంది. అన్ని వర్గాలు సంయమనం పాటించాలి
- రష్యా
మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు తీవ్రతరం కావడాన్ని ఆమోదించబోం
- సౌదీ అరేబియా
దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇజ్రాయెల్ చర్యలు ఈ ప్రాంతాన్ని యుద్ధంలోకి నెట్టేశాయి - టర్కీ
ఉద్రిక్తతలు తగ్గించేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలి - ఈజిప్ట్
మధ్యప్రాచ్యంలో సుస్థిరత కోసం అంతర్జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాలి. గాజా, లెబనాన్‌లో తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలి
- ఇరాక్
తాజా ఉద్రిక్తతలకు ఇజ్రాయెలే కారణం. వెంటనే ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేసి మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతల కోసం చర్యలు తీసుకోవాలి - పాకిస్థాన్
ఇజ్రాయెల్ దాడి ద్వారా ఇరాన్ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగింది - హమాస్
Updated Date - Oct 27 , 2024 | 03:24 AM