Israel-Hamas War: హమాస్ చెరలో మహిళా సైనికులు.. వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్
ABN , Publish Date - May 23 , 2024 | 01:08 PM
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసిన హమాస్ ముష్కరులు.. అదే సమయంలో కొందరు పౌరుల్ని బందీలుగా తీసుకెళ్లారు. ఒకసారి ఇరువర్గాల మధ్య జరిగిన ‘కాల్పుల విరమణ’ ఒప్పందంలో భాగంగా..
గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై (Israel) మెరుపుదాడి చేసిన హమాస్ (Hamas) ముష్కరులు.. అదే సమయంలో కొందరు పౌరుల్ని బందీలుగా తీసుకెళ్లారు. ఒకసారి ఇరువర్గాల మధ్య జరిగిన ‘కాల్పుల విరమణ’ ఒప్పందంలో భాగంగా.. కొందరిని విడిచిపెట్టి ఇజ్రాయెల్‌కు తిరిగి పంపించింది. మరికొంతమంది మాత్రం హమాస్ చెరలోనే ఉండిపోయారు. వారిలో మహిళా సైనికులు కూడా ఉన్నారని.. ఇజ్రాయెల్ తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆర్మీ దుస్తుల్లో నిర్బంధంలో ఉన్న ఆ మహిళల వీడియోని ఓ ఇజ్రాయెలీ టెలివిజన్ ప్రసారం చేసింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
Read Also: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?
కనీసం.. ఈ వీడియో చూసిన తర్వాతైనా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) కాల్పుల విరమణకు పిలుపునిచ్చి, బంధీల విడుదలకు హమాస్‌తో ఒప్పందం చేసుకుంటారని వారి కుటుంబాలు భావిస్తున్నాయి. హమాస్‌తో ఒప్పందానికి ఈ వీడియో కచ్ఛితంగా బెంజమిన్‌పై ఒత్తిడి తీసుకొస్తుందని ఆశిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతున్న ఈ మూడు నిమిషాల వీడియో.. బందీల విడుదలకు మద్దతుని పెంచుతుందని ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ వీడియోపై ప్రభుత్వ ప్రతినిధి డేవిడ్ మెన్సర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మహిళా సైనికులు ఇంకా హమాస్ చెరలోనే ఉన్నారు. ఈ వీడియోని చూడండి. హమాస్ వద్ద బందీలుగా ఉన్న మా ప్రజలను ఇంటికి తీసుకురావడంలో ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వండి’’ అని వేడుకున్నారు.
Read Also: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?
ఇదిలావుండగా.. ‘నాకు పాలస్తీనాలో స్నేహితులు ఉన్నారు’ అని బందీల్లో ఒకరైన 19 ఏళ్ల నామా లేవీ ఆంగ్లంలో చెప్పడం ఆ వీడియోలో గమనించవచ్చు. అందుకు హమాస్ ముష్కరుల్లో ఒకరు అరబిక్ భాషలో స్పందిస్తూ.. ‘‘మీరందరూ కుక్కలు, మేము మిమ్మల్ని తొక్కిపడేస్తాం’’ అని బిగ్గరగా అరుపులు అరిచాడు. ఈ వీడియో బందీల కుటుంబాల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తోంది. కాగా.. ఇప్పటికీ హమాస్ చెరలో 124 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగానే ఉన్నారు. ఫోరమ్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ.. ఇజ్రాయెల్ మరో క్షణం ఆలస్యం చేయకుండా, బందీల విడుదలకు హమాస్‌తో చర్చలు జరపాలని డిమాండ్ పేర్కొంది. అయితే.. నిరంతర సైనికు దాడులు హమాస్‌ను లొంగిపోయేలా చేస్తుందని నెతన్యాహు ప్రభుత్వం చెప్తోంది.
Read Latest International News and Telugu News