Muhammad Yunus: షేక్ హసీనా ఆరోపణలు.. యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్‌తో యూనస్ భేటీ
ABN , Publish Date - Sep 25 , 2024 | 08:56 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా .. తన పదవికి రాజీనామా చేసిన అనంతరం అమెరికాపై తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వేళ.. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ యూఎస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ పునర్ నిర్మాణానికి సహకరిస్తామని యూనస్‌కు యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు.
వాషింగ్టన్, సెప్టెంబర్ 25: దేశ పునర్ నిర్మాణంలో సహాయపడతామని బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. యూఎస్ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌తో తాత్కాలిక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం నెలకొన్న పరిస్థితులను జో బైడెన్‌కు ఆయన వివరించారు.
మరోవైపు ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజేయ్ బంగాతోపాటు ఐక్యరాజ్యసమితిలోని మానవహక్కుల హైకమిషనర్ వాకర్ టర్క్‌తో సైతం మహమ్మద్ యూనస్ వేర్వేరుగా భేటీ అయ్యారు. ఇక సెప్టెంబర్ 15వ తేదీన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మహమ్మద్ యూనస్‌తో యూఎస్‌కు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ దేశ భవిష్యత్తు కోసం ఆర్థిక, రాజకీయ సంబంధాలను విస్తరిస్తామని ఈ భేటీలో యూనస్‌కు యూఎస్ ప్రతినిధి బృందం భరోసా ఇచ్చిన విషయం విధితమే.
ఇటీవల బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీనికి దేశ ప్రజలు సైతం మద్దతు ఇచ్చారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఆ క్రమంలో హింస చెలరేగి వందలాది మంది మరణించగా.. వేలాది మందికి గాయాలయ్యారు. అనంతరం ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు నెలకొన్నాయి. ఇక తప్పని సరి పరిస్థితుల్లో ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం ఆమె పొరుగునున్న భారత్‌లో తలదాచుకున్నారు. ఇక బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరింది. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయి.
ఇంకోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్‌లో చోటు చేసుకున్న అలజడుల వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తముందని సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా చేసిన పలు సూచనలను తాను బేఖాతరు చేయడంతో తాను ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే షేక్ హసీనా చేసిన ఆరోపణలను అమెరికా ఖండించింది. అలాంటి వేళ.. యూనస్ అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడి జో బైడెన్‌తో భేటీ అయ్యారు.
అదీకాక.. ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని భారత్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. అనంతరం జో బైడెన్‌తో యూనస్ సమావేశం కావడం గమనార్హం. మాజీ ప్రధాని షేక్ హసిీనాని తమ దేశానికి అప్పగించాలని భారత్‌కు బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
For More International News And Telugu News...