Washington : జయం నాదే!
ABN, Publish Date - Jul 28 , 2024 | 06:00 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమలాదేవి హ్యారిస్ (59) ధీమా వ్యక్తం చేశారు. ఆఫ్రికన్-భారత సంతతికి చెందిన ఈమె..
అమెరికా ‘అధ్యక్ష’ అభ్యర్థిత్వాన్ని
ప్రకటించిన కమలా హ్యారిస్
డెమోక్రాటిక్ అభ్యర్థినిగా
డిక్లరేషన్‌పై సంతకాలు
ఆగస్టు 1న అధికారిక ప్రకటన
కమలకు భారీగా పెరిగిన మద్దతు
ట్రంప్‌తో అంతరం ఒక్క శాతమే!
న్యూయార్క్ టైమ్స్ సర్వేలో వెల్లడి
వాషింగ్టన్, జూలై 27: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనదే విజయమని ఆ దేశ ఉపాధ్యక్షురాలు, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిని కమలాదేవి హ్యారిస్ (59) ధీమా వ్యక్తం చేశారు. ఆఫ్రికన్-భారత సంతతికి చెందిన ఈమె.. తాను ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థినిగా లాంఛనంగా డిక్లరేషన్ ఫాంపై సంతకాలు చేశారు.
నవంబరు 5న జరిగే ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78)పై కచ్చితంగా గెలుస్తానని.. ప్రతి ఓటూ సాధించడం కీలకమని.. లక్ష్య సాధనకు కఠినంగా శ్రమిస్తానని ఆమె ఆ తర్వాత ‘ఎక్స్’లో తెలిపారు. అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి వైదొలగి ఆమె అభ్యర్థిత్వాన్ని సమర్థించిన సంగతి తెలిసిందే. ఆమె విజయావకాశాలపై తొలుత సందేహం వ్యక్తం చేసిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన భార్య మిచెల్ ఒబామాతో పాటు పలువురు ప్రముఖులు, డెమోక్రాటిక్ దాతలు ఆమెకే మద్దతు ప్రకటించారు. అధ్యక్ష ఎన్నిక బరిలో డెమోక్రాటిక్ పార్టీ నుంచి ఇప్పటివరకు వేరెవరూ తాము పోటీచేస్తున్నట్లు ప్రకటించలేదు. 50 రాష్ట్రాలకు గాను 40కిపైగా రాష్ట్రాల్లో పార్టీ ప్రతినిధులు ఆమెకు మద్దతిస్తున్నారు. పార్టీ జాతీయ కమిటీ ఆగస్టు 1న కమల అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తుంది.
7లోపు తన ఉపాధ్యక్ష అభ్యర్థిని ఆమె ఎంపిక చేసుకోవాలి. తదనంతరం ఆగస్టు 19 నుంచి షికాగోలో మొదలయ్యే పార్టీ జాతీయ కన్వెన్షన్‌లో వారి అభ్యర్థిత్వాలను ధ్రువీకరిస్తారు. అధ్యక్ష ఎన్నికల్లో కమల గెలిస్తే తొలి భారతీయ అమెరికన్‌గా, మొదటి ఆసియావాసిగా, తొలి నల్లజాతి మహిళగా, తొలి జమైకా సంతతి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ భారతీయురాలు. చెన్నై నుంచి అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. తండ్రి డొనాల్డ్ హ్యారిస్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్. జమైకా నుంచి వలస వచ్చారు.
కమలపై ట్రంప్, వాన్స్ వ్యక్తిగత దాడి..
కమలా హ్యారి్‌సపై ట్రంప్, ఆయన ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ వ్యక్తిగత దాడికి దిగారు. ఆమె యూదు వ్యతిరేకిని వివాహమాడారని, ఇజ్రాయెల్‌కు ఆమె బద్ద వ్యతిరేకి అని.. అధ్యక్షురాలైనా ఈ వైఖరి మారదని ట్రంప్ ఓ ప్రచార సభలో చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు అమెరికన్ కాంగ్రె్‌సలో చేసిన ప్రసంగాన్ని ఉద్దేశపూర్వకంగా ఆమె గైర్హాజరయ్యారని ఆరోపించారు. అయితే ఇది సత్యదూరమని.. ముందుగా ఖరారైన కార్యక్రమానికి వెళ్లాల్సి రావడంతో ఆమె రాలేకపోయారని డెమోక్రాటిక్ పార్టీ వర్గాలు తెలిపాయి.
ట్రంప్ 48.. కమల 47%
బైడెన్ డెమోక్రాటిక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు ట్రంప్ విజయం నల్లేరుపై బండి నడకేనని అన్ని సర్వేలూ పేర్కొన్నాయి. ఇప్పుడు ఆయన స్థానంలో కమలా హ్యారిస్ పోటీకి దిగడంతో ట్రంప్‌కు, ఆమెకు మధ్య ఉన్న అంతరం బాగా తగ్గిపోయిందని.. తేడా ఒక్క శాతమేనని ఓ సర్వే సంస్థ ప్రకటించింది. తాజా అభిప్రాయ సేకరణలో ట్రంప్‌కు 48 శాతం మంది మద్దతివ్వగా.. హ్యారి్‌సకు 47 శాతం మంది దన్నుగా నిలిచారని ‘న్యూయార్క్ టైమ్స్-సియెనా కాలేజ్ పోల్’ శనివారం వెల్లడించింది. ముఖ్యంగా డెమోక్రాటిక్ మద్దతుదారులైన ఓటర్లలో 70 శాతం మంది ఆమెకు మద్దతిచ్చినట్లు తెలిపింది.
Updated Date - Jul 28 , 2024 | 06:00 AM