Pakistan: పాక్ సరిహద్దు దిశగా తాలిబాన్ ఫైటర్లు
ABN, Publish Date - Dec 27 , 2024 | 05:22 AM
పాక్-ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లోని బార్మల్ జిల్లాలో పాక్ జరిపిన వైమానిక దాడులపై అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
అత్యాధునిక ఆయుధాలతో
15 వేల మందికి పైగా..
ఆఫ్ఘాన్‌లో పాక్ వైమానిక దాడులతో పెరిగిన ఉద్రిక్తతలు
ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరిక
ఇప్పటికే పాకిస్థాన్‌లో తెహ్రీక్ ఎ తాలిబాన్‌తో కలకలం
కాబుల్, డిసెంబరు 26: పాక్-ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి. సరిహద్దుల్లోని బార్మల్ జిల్లాలో పాక్ జరిపిన వైమానిక దాడులపై అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. పాక్ వైమానిక దాడుల్లో 46 మంది ముఖ్యంగా మహిళలు, చిన్నారులు చనిపోవడంతో తాలిబన్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దాడులను అనాగరిక చర్యగా పేర్కొనడంతో పాటు పాకిస్థాన్‌పై బదులు తీర్చుకుంటామని తాలిబాన్ ప్రభుత్వం హెచ్చరించింది. అఫ్ఘానిస్థాన్‌లోని పాక్ రాయబారిని కూడా పిలిచి తీవ్ర నిరసన తెలిపింది.
ఆ వెంటనే సుమారు 15 వేల మంది తాలిబాన్ ఫైటర్లు కాబుల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నారు. అయితే తాలిబాన్ల శిక్షణ శిబిరాలే లక్ష్యంగా దాడులు జరిపామని పాక్ అంటోంది. అసలే సరిహద్దు వెంబడి ఉన్న తెహ్రీక్ ఎ తాలిబాన్ పాకిస్థాన్(టీటీపీ)తో పడలేకపోతున్న పాకిస్థాన్‌కు ఇప్పుడు అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం కూడా శత్రువుగా మారింది. దీంతో ఇద్దరు శత్రువులను ఎదుర్కోవడం పాకిస్థాన్‌కు సవాలేనని అంతర్జాతీయ పరిశీలకులు చెబుతున్నారు. 15 వేల మంది తాలిబాన్ ఫైటర్లతోనూ అలాగే టీటీపీ ఉగ్ర మూకలతోనూ పాక్ తలపడాల్సి ఉంటుంది.
Updated Date - Dec 27 , 2024 | 05:22 AM