Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్.. కారణమిదే..
ABN , Publish Date - Aug 25 , 2024 | 07:10 AM
టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్(Pavel Durov) నిన్న రాత్రి ఫ్రాన్స్(France)లో అరెస్టయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని బోర్గెట్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. అయితే ఎందుకు అరెస్ట్ చేశారనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టెలిగ్రామ్(Telegram) వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్(Pavel Durov) నిన్న రాత్రి ఫ్రాన్స్(France)లో అరెస్టయ్యారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని బోర్గెట్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పుడు అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి విమానాశ్రయంలో తన ప్రైవేట్ జెట్‌లో దిగాడు. ఓ కేసులో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఈ విషయంపై టెలిగ్రామ్ ఇంకా స్పందించనప్పటికీ, ఆ విషయంపై ఆయనను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. ఈ అరెస్టు నేపథ్యంలో రష్యా బ్లాగర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రెంచ్ రాయబార కార్యాలయాల వెలుపల నిరసనలను తెలుపనున్నట్లు ప్రకటించారు.
అందుకే అరెస్టు
టెలిగ్రామ్ యాప్(Telegram app)కు సంబంధించిన కేసులో దురోవ్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. వాస్తవానికి టెలిగ్రామ్‌లో మోడరేటర్లు లేకపోవడంపై ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తును కేంద్రీకరించారు. మోడరేటర్‌లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్‌లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దీని కారణంగా యాప్ ద్వారా నేర కార్యకలాపాలు పెరుగుతున్నట్లు ఫ్రెంచ్ ఏజెన్సీ OFMIN తెలిపింది.
అరెస్ట్ వారెంట్
ఈ క్రమంలోనే మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినందుకు దురోవ్‌పై ఈ ఏజెన్సీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దురోవ్ తన సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్ నేరపూరిత వినియోగాన్ని అరికట్టడంలో విఫలమైందని ఏజెన్సీ పేర్కొంది. అందుకే అతడిని అరెస్టు చేశారని చెబుతున్నారు. కొన్ని ప్రభుత్వాలు తనపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించాయని, ఇప్పుడు 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న ఈ యాప్ తటస్థ ప్లాట్‌ఫాంగా ఉంటుందని దురోవ్ అంటున్నారు. ఈ కేసులో 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
దురోవ్ ఎవరు?
39 ఏళ్ల దురోవ్ రష్యాలో జన్మించాడు. ఆయన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, యజమాని. టెలిగ్రామ్ అనేది ఉచిత సోషల్ నెట్‌వర్కింగ్ యాప్. దీనిని ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు ఉపయోగిస్తున్నారు. Facebook, YouTube, WhatsApp, Instagram, TikTok, WeChat ఉన్నప్పటికీ టెలిగ్రామ్‌కు కూడా చాలా మంచి గుర్తింపు వచ్చింది. ఈ యాప్‌కు ప్రస్తుతం 900 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 2024-25 సంవత్సరంలో ఒక బిలియన్ యాప్ వినియోగదారులను చేరుకోవడం కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. టెలిగ్రామ్ ప్రధాన కార్యాలయం దుబాయ్‌లో ఉంది. దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టి దుబాయ్‌కు వచ్చాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం దురోవ్ ప్రస్తుత మొత్తం సంపద విలువ $ 15.5 బిలియన్లు (రూ. 12,99,11,62,25,000).
ఇవి కూడా చదవండి:
Dhaka : ఇండో-బంగ్లా సరిహద్దుల్లో ఉద్రిక్తత
Bengaluru : బీమా సొమ్ము కోసం చనిపోయినట్టుగా నాటకం
Read More International News and Latest Telugu News