Uttar Pradesh: తొక్కిసలాటలో 100 మందికి పైగా మృతి
ABN, Publish Date - Jul 02 , 2024 | 04:48 PM
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. హత్రాస్ రతీభాన్‌పూర్‌లో మంగళవారం తొక్కిసలాట జరిగింది. 100 మందికి పైగా మరణించారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
లఖ్‌నవూ, జులై 02: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. హత్రాస్‌లోని రతీభాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏకంగా 100 మందికి పైగా భక్తులు మరణించారు. అలాగే గాయడిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అయితే గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. క్షతగాత్రులను ఎటాహ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. రతీభాన్‌పూర్‌లో పరమశివుడికి సంబంధించి ముగింపు ఉత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ ముగింపు ఉత్సవాలకు ఆ యా పరిసర గ్రామాల నుంచి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై ఎటాహ్ జిల్లా ఎస్పీ రాజేశ్ కుమార్ సింగ్ స్పందించారు. హత్రాస్ జిల్లాలోని రతీభాన్‌పూర్ గ్రామంలో శివుడి ఉత్సవాలు జరిగాయి. వీటికి భారీగా భక్తులు పోటెత్తారు. ఆ క్రమంలో తొక్కిసలాట జరిగిందన్నారు. ఈ ఘటనలో 100 మందికి పైగా భక్తులు మృతి చెందారని తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మృతదేహాలను ఎటాహ్ ఆసుపత్రికి తరలించామని.. వాటిని గుర్తించే పనిలో ఉన్నామని చెప్పారు. అలాగే క్షతగాత్రులను ఎటాహ్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని వివరించారు. మరోవైపు ఈ తొక్కిసలాట దుర్ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సంఘటన స్థలానికి చేరుకుని.. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు.
Also Read: AP Politics: సీఎం రేవంత్‌తో వైఎస్ షర్మిల భేటీ.. స్కెచ్‌లో భాగమేనా?
ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సీఎం యోగి సూచించారు.
Updated Date - Jul 02 , 2024 | 07:17 PM