United Kingdom: ఇద్దరు తెలుగు వారి ఓటమి!
ABN, Publish Date - Jul 06 , 2024 | 04:06 AM
యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు పరాజయంపాలయ్యారు. లేబర్ పార్టీ నుంచి నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గంలో బరిలో దిగిన ఉదయ్ నాగరాజు కన్జర్వేటివ్.....
26 మంది భారత సంతతి ఎంపీల గెలుపు
యూకే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు పరాజయంపాలయ్యారు. లేబర్ పార్టీ నుంచి నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ నియోజకవర్గంలో బరిలో దిగిన ఉదయ్ నాగరాజు కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి రిచర్డ్ పుల్లర్ చేతిలో 5 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడారు. నాగరాజు స్వస్థలం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఈయన బంధువు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీజీ చేశారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన డాక్టర్ చంద్ర కన్నెగంటి (కన్జర్వేటివ్) స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ నియోజకవర్గంలో 6,221 ఓట్లతో మూడో స్థానానికి పరిమితం అయ్యారు. ఈయనపై లేబర్ పార్టీ అభ్యర్థి గారెత్ స్నెల్ విజయం సాధించారు. లండన్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న చంద్ర.. గతంలో స్టోక్ ఆన్ ట్రెంట్‌లో కౌన్సిలర్, మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా, యూకే ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 26 మంది భారత సంతతి వ్యక్తులు ఎంపీలుగా ఎన్నికయ్యారు. వీరిలో అధికులు తాజా ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకున్న లేబర్ పార్టీ వారే కావడం విశేషం. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మాజీ హోం మంత్రులు ప్రీతి పటేల్, సుయెల్లా బ్రేవర్మన్ మరోసారి విజయం సాధించారు.
మరో మాజీ మంత్రి క్లెయిర్ కౌటిన్హో కూడా నెగ్గారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున గగన మహీంద్ర (సౌత్‌వె్‌స్ట హెర్ట్ ఫోర్డ్‌షైర్-), శివానీ రాజా (లీసెస్టర్ ఈస్), సీమా మల్హోత్రా (వాల్‌సాల్), వాలెరీ వాజ్ (బ్లోక్స్‌విచ్), కీత్ వాజ్, లీసా నాండీ, సిక్కు ఎంపీలు ప్రీత్‌కౌర్ గిల్, తన్‌మంజిత్ సింగ్ ధేహి, నవేందు మిశ్రా, రథిమా విటోమ్ విజయ బావుటా ఎగురవేశారు. కాగా, లేబర్ పార్టీ నుంచి 12 మంది భారత మూలాలున్న ఎంపీలు పార్లమెంటులో తొలిసారి అడుగుపెడుతుండడం గమనార్హం.
Updated Date - Jul 06 , 2024 | 04:06 AM