Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. జేఈఈ మెయిన్స్‌లో తక్కువ స్కోర్ వచ్చిందని..
ABN, Publish Date - Feb 13 , 2024 | 01:08 PM
కోచింగ్ సెంటర్లకు కేరాఫ్ గా పేరుగాంచిన కోటా.. మరోసారి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు.
కోచింగ్ సెంటర్లకు కేరాఫ్ గా పేరుగాంచిన కోటా.. మరోసారి వార్తల్లో నిలిచింది. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా ఓ విద్యార్థి హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. దేశవ్యాప్తంగా జరిగే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే ఎడ్యుకేషన్ హబ్‌లో ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏడాది విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ఇది నాలుగోది కావడం గమనార్హం.
జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శుభ్ చౌదరి ఐఐటీ కళాశాలల్లో ప్రవేశం పొందేందుకు అవసరమైన JEE-మెయిన్స్‌కు సిద్ధమవుతున్నాడు. రెండేళ్లుగా కోటాలో చదువుకుంటున్నారు. ఈ క్రమంలో JEE మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే అందులో తాను ఊహించిన స్కోర్ కంటే తక్కువగా వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
గమనించిన తోటి విద్యార్థులు కోచింగ్ సెంటర్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వారు వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు.
కాగా.. 2023లో కోటాలో మొత్తం 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం కోటాలో 2022లో 15 మంది, 2019లో 18 మంది, 2018లో 20 మంది, 2017లో ఏడుగురు, 2016లో 17 మంది, 2015లో 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 13 , 2024 | 01:08 PM