Aadhaar Card: వయసు నిర్ధారణకు ఆధార్ చెల్లుబాటుపై సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు
ABN, Publish Date - Oct 24 , 2024 | 08:41 PM
వ్యక్తి వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తికి పరిహారం చెల్లింపు విషయంలో ఆధార్‌కార్డును బట్టి వయసుని నిర్ధారిస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది.
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార్ కార్డు చెల్లుబాటు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్ కీలక తీర్పునిచ్చింది. ఈ మేరకు ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లింపు విషయంలో ఆధార్‌కార్డును బట్టి వయసు నిర్ధారిస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు జడ్జిలు సంజయ్ కరోల్, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు కీలక తీర్పునిచ్చింది. పిల్లల సంరక్షణ చట్టం, 2015లోని సెక్షన్ 94 ప్రకారం చనిపోయిన వ్యక్తి పుట్టిన తేదీని స్కూల్ సర్టిఫికెట్ల ఆధారంగా నిర్ణయించాలని స్పష్టం చేసింది.
‘‘డిసెంబర్ 20, 2018న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మెమోరాండంను రెఫరెన్స్‌గా తీసుకొని 2023లో విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ జారీ చేసిన సర్క్యులర్ 8 ప్రకారం.. ఆధార్ కార్డ్‌ను వ్యక్తి గుర్తింపు కోసం ఉపయోగించవచ్చు. కానీ పుట్టిన తేదీకి రుజువు కాదు’’ అని బెంచ్ వివరించింది. స్కూల్ సర్టిఫికెట్ల ఆధారంగా చనిపోయిన వ్యక్తి వయసును నిర్ధారించాలంటూ మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) ఇచ్చిన తీర్పును న్యాయస్థానం సమర్థించింది.
కాగా 2015లో రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోగా మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్-రోహిత్ తీర్పు ప్రకారం బాధిత కుటుంబానికి రూ.19.35 లక్షల పరిహారం మంజూరైంది. అయితే ఈ కేసు హైకోర్టుకు చేరడంతో ఆధార్ కార్డు ఆధారంగా వయసు 47 ఏళ్లుగా నిర్ధారించిన న్యాయస్థానం నష్టపరిహారాన్ని రూ.9.22 లక్షలకు కుదించింది. దీంతో మృతుడి బంధువులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. విచారణ చేపట్టి ఈ తీర్పునిచ్చింది. కాగా ఆధార్ ప్రకారం చనిపోయిన వ్యక్తి వయసు 47 ఏళ్లుగా ఉందని, అయితే స్కూల్ సర్టిఫికేట్ల ఆధారంగా 45 ఏళ్లు అని బంధువులు పేర్కొన్నారు. సుప్రీంకోర్ట్ తీర్పుతో బాధిత కుటుంబానికి రూ.19.35 లక్షల పరిహారం అందనుంది.
Updated Date - Oct 24 , 2024 | 08:44 PM