Assembly Elections: ఖాతా తెరవని 'ఆప్'.. కాంగ్రెస్ ఓట్లకు గండి
ABN, Publish Date - Oct 08 , 2024 | 12:33 PM
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్‌లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది. అయితే రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ తమ పరిధిని విస్తరించుకోవాలని చూసినా.. ఆశాభంగం తప్పలేదు. జమ్మూ, హరియాణా రెండు రాష్ట్రాల్లో ఒక్కస్థానంలోనూ ఆప్ ఖాతా తెరవకపోవడం గమనార్హం. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ నుంచి సవాలు ఎదుర్కుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాలు షాక్ ఇచ్చాయని అనుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలతో పాటు ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో హరియాణా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలు ఆప్‌నకు నిరాశ కలిగించడం సాధారణమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
హరియాణాలో తొలుత కాంగ్రెస్‌తో పొత్తు ప్రయత్నాలు జరిగినా సీట్ల పంపకం తేడాతో కాంగ్రెస్‌తో ఆప్ విబేధించింది. రెండు రాష్ట్రాల్లో అన్ని స్థానాల్లో ఆప్ తమ అభ్యర్థులను బరిలోకి దించి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. తద్వారా ఓట్ల చీలికతో పరోక్షంగా ఎన్డీఏ కూటమికే ఆప్ పోటీ మేలు చేసిందన్న విమర్శలు ఎదుర్కుంటోంది.
మెహబూబా ముఫ్తీ కుమార్తె ఓటమి..
శ్రీగుఫ్వారా – బిజ్‌బెహరా (Srigufwara – Bijbehara)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) ఓటమి పాలయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. ఓటమిని ఆమె అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - Oct 08 , 2024 | 12:34 PM