Arvind Kejriwal arrest: జైల్లో కీలకనేతలు.. ఆప్‌ను నడిపించేదెవరు?
ABN, Publish Date - Mar 22 , 2024 | 10:26 AM
అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు.
అవినీతికి వ్యతిరేకంగా.. సుపరిపాలన అందిచడమే లక్ష్యంగా.. అన్నాహజారే ఉద్యమంలోంచి పుట్టిన పార్టీ. అతి తక్కువ సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దేశం మొత్తం పార్టీని విస్తరించేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీగా ప్రారంభమై.. తక్కువ కాలంలో జాతీయపార్టీగా ఎదిగింది. పంజాబ్‌లోనూ అధికారం చేపట్టింది. అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ఎంత వేగంగా ప్రజలను ఆకట్టుకుందో.. అంతే వేగంగా అవినీతి ఆరోపణల్లో ఆ పార్టీ కూరుకుపోయింది.
ప్రస్తుతం ఆప్ సీనియర్ నేతలంతా జైల్లో ఉన్నారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి అంతే. గురువారం కేజ్రీవాల్‌ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ఈరోజు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టి.. రిమాండ్ విధిస్తే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈడీ అరెస్ట్ నుంచి ఉపశమనం పొందేందుకు కేజ్రీవాల్ చివరి వరకు ప్రయత్నించారు. 9 సార్లు దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసినా విచారణకు హాజరుకాలేదు. రాజకీయ కుట్రలో ఈడీ పావుగా మారిందని ఆప్ ఆరోపిస్తూ వస్తోంది. చివరికి అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చిన గంటల వ్యవధిలో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారు. పలు కేసుల్లో ఆప్ కీలక నేతలు ఇప్పటికే అరెస్ట్ అయి ఏళ్ల తరబడి జైల్లోనే ఉన్నారు.
Kejriwal Arrest: ఒక్క కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తే లక్షల మంది కేజ్రీవాల్‌లు లేచి వస్తారు
ముఖ్య నేతలుగా..
ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీలో అతిషి, రాఘవ్ చద్దా, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్‌తో సహా మరికొందరు నేతలు మాత్రమే గుర్తింపు గల ముఖాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఢిల్లీలో మినహా దేశ వ్యాప్తంగా ప్రభావం చూపే నాయకులు అయితే పెద్దగా లేరనే చెప్పుకోవాలి. ఆప్ ఏర్పాటుకు అన్నా హజారే ఉద్యమంలోనే పునాదిరాయి పడింది. అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్ వంటివాళ్లు పార్టీ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. మనీష్ సిసోడియా, సతేంద్ర జైన్, సంజయ్ సింగ్, సోమనాథ్ భారతి, అతిషి, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలిచారు. దేశ ప్రజలు వీరిపై విశ్వాసం ఉంచారు. దీంతో ఆ పార్టీకి దేశ, విదేశాల నుంచి భారీగా నిధులు వచ్చాయి. ఫలితంగా ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. అయితే పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యవహర శైలి, ఆయన విధానాలపట్ల అసంతృప్తితో కొందరు నేతలు పార్టీని వీడారు. ప్రశాంత్ భూషణ్, కుమార్ విశ్వాస్, జర్నలిస్ట్ అశుతోష్ వంటివారు పార్టీని వీడారు. ఆ తర్వాత ఆప్ అన్ని రాజకీయ పార్టీల వంటిదేననే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి రావడంతో ఆ పార్టీకి అది మాయని మచ్చగా మారింది.
లిక్కర్ స్కామ్‌లో..
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో బలంగా ఎదిగిన ఆప్.. అవే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయింది. అవినీతి ఆరోపణలతో మొదట సోమనాథ్ భారతిని, ఆ తర్వాత సత్యేందర్ జైన్ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ కుడిభుజంగా ఉన్న మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉన్నారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
మిగిలింది వీళ్లే..
మనీష్ సిసోడియా జైలుకు వెళ్లిన తర్వాత ఢిల్లీ ప్రభుత్వంలో అతిషి కీలక నేతగా మారారు. ఓ విధంగా చెప్పాలంటే పార్టీలో ఆమె నెంబర్ 2 అయ్యారు. రాఘవ్ చద్దా గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్ వంటి నేతలు ప్రస్తుతం ఆప్‌లో ముఖ్య నేతలుగా ఉన్నారు. గోపాల్ రాయ్ కేజ్రీవాల్‌కు అత్యంత నమ్మకస్తునిగా ఉన్నారు. కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళితే ఆప్ పరిస్థితి ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై న్యాయ పోరాటానికి ఆ పార్టీ సిద్ధమైంది. కోర్టు ఈ కేసులో ఎలాంటి తీర్పునిస్తుందనే తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 22 , 2024 | 10:44 AM