Lok Sabha Elections: ఆప్ 'జేల్ కా జవాబ్ ఓట్ సే' ప్రచారం షురూ
ABN, Publish Date - Apr 08 , 2024 | 02:57 PM
జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆదివారంనాడు నిరాహార దీక్ష చేపట్టిన ఆ పార్టీ సరికొత్త థీమ్‌తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్‌ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పండంటూ ''జైల్ కా జవాబ్ ఓట్ సే'' ప్రచారాన్ని సోమవారం ప్రారంభించింది.
న్యూఢిల్లీ: జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సంఘీభావంగా ఆదివారంనాడు నిరాహార దీక్ష చేపట్టిన ఆ పార్టీ సరికొత్త థీమ్‌తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్‌ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పండంటూ ''జైల్ కా జవాబ్ ఓట్ సే'' (Jail Ka Jawab Vote Se) ప్రచారాన్ని సోమవారం ప్రారంభించింది. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ దీనిపై మాట్లాడుతూ, కేజ్రీవాల్‌ను ఎన్నికలకు దూరంగా ఉంచాలనే ఆలోచనతోనే జైలుకు పంపిన విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు. కేజ్రీవాల్ తన యావజ్జీవితం ప్రజల కోసమే పోరాటం చేస్తున్నారని చెప్పారు. ఢిల్లీ ప్రజలను తన కుటుంబ సభ్యులుగా భావించి అందరికీ ఉత్తమ విద్య, ఆరోగ్యం, విద్యుత్, నీరు అందించేందుకు ఎంతో తపన పడుతున్నారని అన్నారు. 'జైల్ కా జవాబ్ ఓట్ సే' నినాదంతో ఢిల్లీలోని ఇంటింటికి వెళ్లి తాము ప్రచారం సాగించనున్నామని చెప్పారు. ఈరోజు నుంచే ప్రచారం ప్రారంభిస్తున్నామని, ఆప్ పోటీ చేస్తున్న 4 లోక్‌సభ నియోజకవర్గాల్లో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తారని తెలిపారు.
నడ్డాను ఎందుకు విచారించట్లేదు?
దీనికి ముందు, కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేసిన ఆప్ నేతలు..తమ నేతను జైలుకు పంపిన బీజేపీకి ప్రజలు రాబోయే ఎన్నికల్లో గట్టి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీకి ధైర్యం ఉంటే ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని సవాలు చేసారు. అదే జరిగితే దేశ రాజధానిలో బీజేపీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని అన్నారు. పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు ఈ నిరాహార దీక్షలో పాల్గొని కేజ్రీవాల్ కటకటాల వెనుక వెనుక ఉన్న పోస్టర్లను ప్రదర్శిస్తూ దేశభక్తి గీతాలు ఆలపించారు. ఇదే తరహా నిరసనలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాల్లోని ఎన్ఐఆర్‌లు కూడా జరిపినట్టు ఆప్ తెలిపింది. బోస్టన్‌లోని హార్వార్డ్ స్క్వేర్ వద్ద, వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం వెలుపల, న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్, టోరంటో, లండన్, మెల్‌బోర్న్ తదితర ప్రాంతాల్లో ఈ నిరసనలు జరిగినట్టు చెప్పారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Apr 08 , 2024 | 02:57 PM