Arvind Kejriwal arrest: జంతర్‌మంతర్ వద్ద 7న 'ఆప్' నిరాహార దీక్ష
ABN, Publish Date - Apr 03 , 2024 | 07:25 PM
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిరాహార దీక్షకు దిగనుంది. ఈనెల 7వ తేదీన జంతర్‌మంతర్ వద్ద ఆప్ నేతలు నిరాహార దీక్ష జరుపనున్నట్టు పార్టీ నేత గోపాల్ రాయ్ తెలిపారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిరాహార దీక్షకు దిగనుంది. ఈనెల 7వ తేదీన జంతర్‌మంతర్ వద్ద ఆప్ నేతలు నిరాహార దీక్ష (Hunger strike) జరుపనున్నట్టు పార్టీ నేత గోపాల్ రాయ్ (Gopal Rai) తెలిపారు. బుధవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆప్ కన్వీనర్‌కు సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిస్తున్నట్టు చెప్పారు.
''ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్టును మీరు వ్యతిరేకిస్తుంటే, ఏప్రిల్ 7న మీరు నిరాహార దీక్షలో పాల్గొనండి. ఇంట్లో, మీ సిటీలో, ఎక్కడైనా సరే సమష్టిగా నిరాహార దీక్ష చేయండి'' అని రాయ్ ఈ సందర్భంగా ఆప్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జంతర్ మంతర్ వద్ద జరుగుపుతున్న నిరాహార దీక్ష పబ్లిక్ ఈవెంట్ అని, ఇందులో ఢిల్లీ ప్రభుత్వ మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కౌన్సిలర్లు, ఆఫీసు బేరర్లు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, వర్తక సంఘాలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేసేందుకు పార్టీ అగ్రనేతలందరినీ అరెస్టులు చేస్తూ పోతున్నారని కేంద్రంపై ఆయన విమర్శలు గుప్పించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 03 , 2024 | 07:25 PM