Adani Group: అవినీతి ఆరోపణలు.. స్పందించిన అదానీ గ్రూప్స్..
ABN, Publish Date - Nov 21 , 2024 | 03:30 PM
Adani Group: అదానీ గ్రూప్స్ డైరెక్టర్స్‌కి అమెరికా న్యాయశాఖ నోటీసులు జారీ చేయడంపై కంపెనీ స్పందించింది. ఆరోపణలపై స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో తమపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చింది.
Allegations on Adani: అదానీ గ్రూప్‌పై అమెరికాలో కేసు నమోదవడంపై ఆ కంపెనీ స్పందించింది. తమ సంస్థలపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. తమపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందదని.. నేరం రుజువు కాకుండానే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నేరం రుజువు కానంత వరకు వ్యక్తులు, సంస్థలు నిర్దోషులుగానే భావించడం జరుగుతుందని కంపెనీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
అదానీ గ్రీన్ సంస్థ డైరెక్టర్లకు అమెరికా న్యాయశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెను దుమారం రేపింది. షేర్ మార్కెట్ ప్రారంభానికి ముందే ఈ నోటీసులు రావడంతో.. అదానీ గ్రూప్స్ భారీ నష్టాన్ని చవిచూశాయి. ఏకంగా రూ. 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. మరోవైపు పొలిటికల్ పరంగానూ రచ్చ రచ్చ అవుతోంది. ప్రతిపక్ష పార్టీలు అదానిపై కఠిన చర్యలు తీసుకోవాలని.. జేపీసీ వేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ అధికారికంగా ఒక ప్రకటన చేసింది. తమపై వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇచ్చింది.
‘అదానీ గ్రీన్ సంస్థ డైరెక్టర్లపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి. అవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఆ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు. వాటిని మేం ఖండిస్తున్నాం. నేరం రుజువు అయ్యేంత వరకు ఆరోపణలు వచ్చిన వ్యక్తులు, సంస్థలను నిర్ధోషులుగానే భావిస్తారు. అదానీ గ్రూప్ తన కార్యకలాపాల్లో పారదర్శకత, అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు కట్టుబడి ఉంటుంది. అదానీ గ్రూప్.. కంపెనీ వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులకు భరోసా కల్పించడంతో పాటు చట్టాన్ని గౌరవిస్తుంది.’ అని తన ప్రకటనలో పేర్కొంది కంపెనీ.
అసలేం జరిగింది..
రూ. 16,890 కోట్లు లాభం చేకూర్చే సౌరశక్తి సరఫరా కాంట్రాక్ట్‌లను దక్కించుకునేందుకు భారత ప్రభుత్వ అధికారులకు అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందంటూ అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అభియోగ పత్రాల్లో పేర్కొన్నారు. ఈ కాంట్రాక్టులకు సంబంధించి బ్యాంకులు, ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించాయి. ఈ ప్రాజెక్టుల్లో అమెరికా ఇన్వెస్టర్ల నిధులు కూడా ఉండటంతో ఆదేశం ఎఫ్‌బీఐ ద్వారా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్.. అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురికి నోటీసులు జారీ చేసింది.
Updated Date - Nov 21 , 2024 | 03:30 PM