Delhi: ఉగ్రవాదుల కాల్పుల్లో వాయుసేన జవాను మృతి
ABN, Publish Date - May 05 , 2024 | 04:51 AM
జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో భారత వాయుసేనకు చెందిన ఓ జవాను మృతి చెందగా నలుగురు సైనికులకు గాయాలయ్యాయి.
ఐదుగురికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం
న్యూఢిల్లీ, మే 4: జమ్మూకశ్మీర్‌లో భారత భద్రతా బలగాలపై శనివారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో భారత వాయుసేనకు చెందిన ఓ జవాను మృతి చెందగా నలుగురు సైనికులకు గాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉన్న శశిధర్ ప్రాంతంలో వాయుసేనకు చెందిన వాహనంతో పాటు మరో వాహనంపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
గాయపడిన సైనికులను ఉదంపూర్ కమాండ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నా రు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు అదనపు బలగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గతేడాది ఇదే ప్రాంతంలో సైన్యంపై వరుస ఉగ్రదాడులు జరగగా, ఈ ఏడాది ఇదే అతి పెద్ద దాడి. పూంచ్ జిల్లాలో మే 25న ఆరో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
Updated Date - May 05 , 2024 | 04:51 AM