Death Secrets: ప్రాణం పోయిన 2 గంటల్లోపు ఏం జరుగుతుంది.. డెత్ సీక్రెట్స్ చెప్పిన సీనియర్ నర్సు
ABN , Publish Date - Nov 13 , 2024 | 04:07 PM
మనిషి మరణానంతరం ఆత్మ ఏ విధంగా ప్రయాణిస్తుందో తెలిపే విషయాలు ఇంటర్నెట్లో ఎన్నో ఉన్నాయి. కానీ, ఆత్మను వదిలేసిన తర్వాత ఆ శరీరంలో ఏం జరుగుతుందనేది చాలా తక్కువ మందికి తెలుసు..
మనిషిని అన్నింటికన్నా ఎక్కువ భయపెట్టేది చావు మాత్రమే. అయితే, అమెరికాకు చెందిన ఓ నర్సు మాటలు వింటే మాత్రం మరణం గురించిన భయాల్ని వదిలేస్తారు. ప్రాణం పోయిన తర్వాత కూడా రెండు గంటల పాటు శరీరం పనిచేస్తుందని ఆమె తెలిపారు. ఎన్నో దశాబ్దాలుగా ఇంటెన్సివ్ కేర్ లో పనిచేసిన జూలీ మెక్ ఫేడెన్ కొన్ని వేల మరణాలను కళ్లారా చూశారు. మనిషి శరీరం నుంచి ప్రాణం పోవడం ఆ తర్వాత డెడ్ బాడీ లోనైన మార్పులను జూలీ దగ్గర నుంచి గమనించారు. తన అనుభవాన్ని ఇటీవల ఆమె యూట్యూబ్ ద్వారా పంచుకోవడంతో ఆ వీడియో వైరల్ గా మారింది. మనిషి చనిపోయిన తర్వాత ఆ శరీరం పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాలపై ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అంతులేని ప్రశాంత స్థితిలోకి..
శరీరం ప్రాణాన్ని విడిచిన వెంటనే అంతులేని విశ్రాంతిని పొందుతుంది. అందుకే చాలా మంది మరణించిన వెంటనే మల మూత్ర విసర్జన చేయడం, ముక్కు లేదా చెవుల నుంచి రక్తం కారడం వంటివి చూస్తుంటాం. శరీరంలోని కండరాలన్నీ రెస్ట్ మోడ్ లోకి వెళ్లడంతో వాటిపై నియంత్రణ లేక ఇలా జరుగుతుందని ఆమె వివరించింది.
ఒళ్లంతా చల్లబడుతుంది..
చనిపోయిన వెంటనే వ్యక్తి శరీర ఉష్ణోగ్రతలు గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది. కొందరి శరీరం ఇందుకు భిన్నంగా స్పందిస్తుంది. కొందరికి శరీరం చల్లబడే ప్రక్రియ వెంటనే మొదలవుతుంది. మరికొందరిలో రెండు గంటలు పట్టొచ్చు.
శరీరం రంగు మారుతుంది..
ప్రాణం శరీరం నుంచి వేరుపడగానే బాడీ ముదురు రంగులోకి మారుతుంటుంది. దీనికి కారణం అలాగే శరీరంలో ఉండిపోయిన రక్తం గురుత్వాకర్షణ శక్తికి లోనవ్వడమే. వ్యక్తిని పడుకోబెట్టినప్పుడు వారి కిందివైపు శరీరంలో ఇది వచ్చి చేరుతుంది.
కాళ్లు చేతులు బిగుసుకుంటాయి..
జీవక్రియలు ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. పోస్ట్ మార్టం తర్వాత 2-4 గంటల్లోపు ఇది ప్రారంభమవుతుంది. వివిధ అంశాల ఆధారంగా 72 గంటల వరకు కొనసాగుతుంది. దీంతో శరీరం మోయలేనంత బరువుగా అనిపిస్తుంది. ఆ తర్వాత శరీరం కుళ్లిపోవడం జరుగుతుంటుంది అని నర్స్ జూలీ వెల్లడించారు.