Jammu Kashmir: జీరో టెర్రర్ ప్లాన్ అమలు చేయండి.. కశ్మీర్ ఏజెన్సీలను ఆదేశించిన అమిత్ షా
ABN, Publish Date - Jun 16 , 2024 | 07:25 PM
జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah) ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను అణచివేసేందుకు ఏరియా డామినేషన్, జీరో టెర్రర్ ప్లాన్‌లను అమలు చేయాలని ఏజెన్సీలను ఆయన ఆదేశించారు.
కశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amith Shah) ఆదివారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులను అణచివేసేందుకు ఏరియా డామినేషన్, జీరో టెర్రర్ ప్రణాళికలను అమలు చేయాలని ఏజెన్సీలను ఆయన ఆదేశించారు. మిషన్ మోడ్‌లో సమన్వయంతో పని చేసి సత్వరంగా స్పందించాలని షా ఆదేశించారు.
ఏజెన్సీలు సమన్వయాన్ని కొనసాగించి సున్నితమైన ప్రాంతాలను గుర్తించి వాటి భద్రతపై దృష్టి సారించాలని సూచించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని.. దాన్ని పూర్తిగా అంతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని పునరుద్ఘాటించారు.
ఉగ్రదాడుల నేపథ్యంలో అప్రమత్తం..
ఉగ్రవాద దాడుల నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులకు షా కీలక సూచనలు చేశారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు భద్రత దళాలు వెంటనే చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ఇక జూన్ 29వ తేదీ నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లకు ఆస్కారం ఉందని.. ఈ నేపథ్యంలో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులతోపాటు సరిహద్దు నియంత్రణ రేఖ వద్ద భద్రతా దళాలను మోహరించాలని ఉన్నతాధికారులకు ఆయన స్పష్టం చేశారు.
జమ్ము కాశ్మీర్‌లో తీవ్రవాద నిరోధానికి చేపడుతున్న చర్యలను మరింత బలోపేతం చేయాలన్నారు. ఉగ్రవాద నిరోధక చర్యలపై ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన ఆదేశాలను అమిత్ షా ఈ సందర్బంగా ప్రస్తావించారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజిత్ భల్లా, జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతోపాటు ఆ రాష్ట్రానికి చెందిన పలు కీలక శాఖల ఉన్నతాధిరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 16 , 2024 | 07:35 PM