Amitabh Bachchan: రతన్ టాటా అలా అడుగుతారని అసలు ఊహించ లేదు
ABN, Publish Date - Oct 29 , 2024 | 03:17 PM
లక్షల కోట్ల రూపాయిలున్న టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా సాదా సీదాగా జీవించారన్నారు. ఆయన సాధారణ మనిషిగా మసులుకున్నారని తెలిపారు. అత్యంత నిరాడంబర జీవనాన్ని సాగించిన గొప్ప వ్యక్తి ఆయన అని అమితాబ్ పేర్కొన్నారు. రతన్ టాటాతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా అమితాబ్ వివరించారు.
ముంబయి, అక్టోబర్ 29: ప్రముఖ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్ సంస్థల అధిపతి రతన్ టాటా ఇటీవల మృతి చెందారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని బాలీవుడ్ బాద్ షా అమితాబ్ గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ సారథ్యంలో కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 16 కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ దర్శకులు ఫరాఖాన్, నటుడు బొమన్ ఇరానీ పాల్గొన్నారు. అమితాబ్.. తనకు రతన్ టాటాతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్బంగా నెమరేసుకున్నారు.
దేశంలోనే ప్రముఖ సంస్థకు అధిపతి అయినా.. రతన్ టాటా చాలా సాదా సీదాగా జీవించారన్నారు. ఒకసారి రతన్ టాటా, తాను లండన్‌కు ఒకే విమానంలో కలిసి ప్రయాణించామని చెప్పారు. విమానం హీత్రో విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని.. ఈ సందర్భంగా తనను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన వారిని రతన్ టాటా గుర్తించ లేకపోయారని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి కాల్ చేసేందుకు సమీపంలోని ఫోన్ బూత్‌కు ఆయన వెళ్లారన్నారు. ఆ పక్కనే తాను నిలబడి ఉన్నానని పేర్కొన్నారు. అయితే తనను ఆయన ఇలా అడుగుతారని తాను నమ్మలేకపోయానన్నారు. అమితాబ్.. నేను మీ నుంచి కొంత డబ్బు తీసుకోవచ్చా? ఫోన్ చేయడానికి తన వద్ద నగదు లేదన్నారని గుర్తు చేసుకున్నారు.
రతన్ టాటాలో నిరాడంబరతకు మరో నిదర్శనం
అలాగే రతన్ టాటాలోని నిరాడంబరతను అమితాబ్ వివరించారు. తన స్నేహితుడితో కలిసి ఓ కార్యక్రమానికి తాను హాజరయ్యానన్నారీ అమితాబ్. ఈ కార్యక్రమానికి రతన్ టాటా కూడా హాజరయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమం ముగిసే సమయంలో.. తన స్నేహితుడు వద్దకు రతన్ టాటా వచ్చారన్నారు. తాను మీ ఇంటి వెనుకనే ఉంటానని.. తన ఇంటి వద్ద దింపగలరా? అంటూ నా స్నేహితుడిని రతన్ టాటా కోరారని వివరించారు. తనకు కారు లేదని రతన్ టాటా ఈ సందర్భంగా తెలిపారన్నారు. దీంతో ఆశ్చర్య పోవడం తన వంతు అయిందని పేర్కొన్నారు. ఇది మనం ఊహించగలమా? అంటూ బొమన్ ఇరానీ, ఫరాఖాన్‌తో అమితాబ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇక టాటా సంస్థ తాను ముఖ్య పాత్రలో ఏత్బార్ చిత్రాన్ని నిర్మించిందన్నారు. ఈ చిత్రం అంతగా విజయం సాధించలేదని చెప్పారు. ఈ చిత్రం ద్వారా ఆ సంస్థకు 3.5 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అమితాబ్ ఈ కార్యక్రమంలో వివరించారు.
అక్టోబర్ 9వ తేదీన రతన్ టాటా మరణించారు. ఆయన మరణంపై ఎక్స్ వేదికగా మొట్ట మొదట అమితాబ్ బచ్చన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్ 11వ తేదీన రతన్ టాటా అంత్యక్రియలు జరిగాయి. ఆ కార్యక్రమానికి ప్రముఖులు సచిన్ టెండుల్కర్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు రిలయన్స్ గ్రూప్ సంస్థల అధినేత ముఖేశ్ అంబానీ తదితరులు హాజరయ్యారు.
For National News And Telugu News...
Updated Date - Oct 29 , 2024 | 03:17 PM