మూఢనమ్మకంతో బాలుడిని బలిచ్చారు!
ABN, Publish Date - Sep 28 , 2024 | 03:45 AM
తమ స్కూలు అడ్మిషన్లతో కళకళలాడాలని ఆ బడిలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని బలిచ్చారు ఓ ప్రైవేటు పాఠశాల యజమానులు.
యూపీలో ఓ ప్రైవేటు స్కూల్లో దుర్మార్గం
హాస్టల్ నుంచి కిడ్నాప్.. బడి వద్ద హత్య
స్కూలు బాగా నడవాలని ఈ దుశ్చర్య
యజమాని, డైరెక్టర్, ప్రిన్సిపల్,
ఇద్దరు ఉపాధ్యాయుల అరెస్టు
స్కూల్ బాగా నడవాలని 11 ఏళ్ల బాలుడిని బలిచ్చారు!
ఆగ్రా, సెప్టెంబరు 27: తమ స్కూలు అడ్మిషన్లతో కళకళలాడాలని ఆ బడిలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని బలిచ్చారు ఓ ప్రైవేటు పాఠశాల యజమానులు. యూపీలోని హత్రాస్‌లో ఈ ఘోరం వెలుగుచూసింది. డీఎల్ పబ్లిక్ స్కూల్ ఓనర్ జశోధన్ సింగ్‌కు తాంత్రిక పూజలపై విశ్వాసం మెండు. బడి విజయవంతంగా నడిచేందుకుగాను ఓ పిల్లాడిని బలివ్వాలని స్కూల్ డైరెక్టర్ అయిన తన కుమారుడు దినేశ్ భాగెల్‌కు సూచించగా సరేనన్నాడు. ఈ మేరకు జశోధన్, దినేశ్‌తో పాటు ప్రిన్సిపల్ లక్ష్మణ్ సింగ్ మరో ఇద్దరు ఉపాధ్యాయులు కలిసి సెప్టెంబరు 23న హాస్టల్‌లో నిద్రిస్తున్న కృతార్థ్ (11) అనే బాలుడిని అపహరించారు.
తాంత్రిక పూజల కోసం బడి ప్రాంగణంలోకి తీసుకెళ్లగా అక్కడ నిద్రలేచిన బాలుడు బిగ్గరగా ఏడుస్తుండటంతో గొంతు నులిమి చంపారు. తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని, ఆస్పత్రికి తీసుకెళుతున్నామంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పగా.. వారొచ్చి దినేశ్ కారును అడ్డుకున్నారు. ఆ కారులోంచి బాలుడి మృతదేహం స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, సెప్టెంబరు 6న తొమ్మిదేళ్ల బాలుడిని బలిచ్చేందుకు వీరు ప్రయత్నించారని పోలీసుల దర్యాప్తులో తేలింది.
Updated Date - Sep 28 , 2024 | 03:45 AM