Chandrababu Naidu: మహారాష్ట్రలో ‘మహాయుతి’ విజయం ఖరారు.. ప్రధానికి చంద్రబాబు శుభాకాంక్షలు
ABN, Publish Date - Nov 23 , 2024 | 02:45 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం ఖరారైపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఎన్టీయేకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి విజయం ఖరారైపోయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మహారాష్ట్రలో చారిత్రక విజయం సొంతం చేసుకున్న మహాయుతి కూటమికి శుభాకాంక్షలు. ప్రధాని మోదీ నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి ఈ విజయం ప్రతిబింబంగా నిలుస్తోంది. ప్రధాని వ్యూహాత్మక దార్శనికత, విధానాలు, ప్రజల పట్ల నిబద్ధత వికసిత్ భారత్ లక్ష్యానికి బాటలు పరుస్తున్నాయి’’ అని చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు (Maharashtra).
Maharashtra elections 2024: మెజారిటీ మార్క్‌ను దాటిని 'మహాయుతి'
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలు ప్రస్తుతం వెలువడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మహారాష్ట్ర ఫలితాల్లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మెజారిటీ మార్కుకు పైబడిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ మాత్రం కేవలం 56 స్థానాల్లో ముందంజలో ఉంది. మహాయుతి 17 స్థానాల్లో విజయ ఢంకా మోగించగా మహావికాస్ అఘాఢీ ఒక స్థానంలో జయ కేతనం ఎగురవేసింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 145 ఎమ్మెల్యే అవసరమైన నేపథ్యంలో మహాయతి విజయం ఖరారైపోయింది.
అయితే, మహారాష్ట్రలో వెనకబడ్డ కాంగ్రెస్‌కు ఝార్ఖండ్ ఫలితాలు ఊరటిచ్చాయి. అక్కడి జేఎంఎం కూటమి 51 స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని కూటమి 29 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఝార్ఖండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 41.
Pawan Kalyan: మహారాష్ట్రలోనూ పవన్ కల్యాణ్ హవా.. పవన్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ దూకుడు..
ఇదిలా ఉంటే, మహారాష్ట్రలో ఎన్డీయే అఖండ విజయం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరిని వరిస్తుందన్న విషయంపై చర్చ మొదలైంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌కు సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నాయన్న వార్త అక్కడి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన సీఎం బాధ్యతలు చేపడతారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే ఫడణవీస్‌తో భేటీ కానున్నారు. ఇక మహాయుతి కూటమిలోని బీజేపీ 149 స్థానాల్లో పోటీ చేయగా, శివసేన 81, ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీలోని కాంగ్రెస్ 101, శివసేన (ఉద్ధవ్) 95 స్థానాల్లో, ఎన్సీపీ (ఎస్‌పీ) 86 సీట్లలో తలపడ్డాయి.
Updated Date - Nov 23 , 2024 | 02:55 PM