ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Arvind Kejriwal : రాజీనామా చేస్తా

ABN, Publish Date - Sep 16 , 2024 | 02:48 AM

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ‘‘నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను.

  • పదవి నుంచి తప్పుకొంటానని ఢిల్లీ సీఎం కేజ్రీ ప్రకటన

  • ఇది నాకు నేను విధించుకునే అగ్నిపరీక్ష

  • పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు

  • దేవుడు అండగా ఉండి రక్షించాడు

  • రాజ్యాంగాన్ని కాపాడాలనే ఇంతకాలం రాజీనామా చేయలేదు

  • నిర్దోషిగా నిరూపించుకునే వరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను

  • నవంబరులోనే ఎన్నికలు నిర్వహించాలి

  • సీఎం పదవిని ప్రజాకోర్టు నిర్ణయిస్తుంది

  • కార్యకర్తల భేటీలో కేజ్రీవాల్‌ వ్యాఖ్యలు

  • కొత్త సీఎంగా ఆతిషికి అవకాశాలు!

  • హరియాణాపై దృష్టి సారించనున్న కేజ్రీ

  • ఆయన రాజీనామా ఓ గిమ్మిక్కు: కాంగ్రెస్‌

  • అది పబ్లిసిటీ కోసం నాటకం: బీజేపీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 15: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. ‘‘నేను నిర్దోషిగా నిరూపించుకునేంత వరకు సీఎం పదవిలో ఉండను. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆప్‌ను గెలిపించి, అధికారం కట్టబెట్టేవరకు సీఎం పీఠాన్ని అధిరోహించను’’ అని వ్యాఖ్యానించారు. రాజీనామా తర్వాత.. తదుపరి సీఎంను ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలోని ఆప్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కేజ్రీవాల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్‌ కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడే తమ వెంట ఉండి, ముందుకు నడిపించారని, దేవుడిచ్చిన ధైర్యంతోనే శత్రువులపై పోరాడుతామని ఉద్ఘాటించారు. కాగా, ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే..!

ఆర్నెల్లుగా జైలులో ఉన్న ఆయన సుప్రీంకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. అప్పుడు విలేకరులతో మాట్లాడుతూ దేశాన్ని బలహీనపరుస్తూ.. విభజించే ప్రయత్నాలు చేస్తున్న శక్తులపై తాను పోరాటం చేస్తానని ప్రతినబూనారు. ఆదివారం కార్యకర్తలతో భేటీ అయ్యారు. ‘‘మా నేతలు సత్యేందర్‌ జైన్‌, అమానతుల్లాఖాన్‌ ఇంకాజైలులోనే ఉన్నారు. వారూ త్వరలో బయటకు వస్తారని భావిస్తున్నాను’’ అనే ఆశాభావం వ్యక్తం చేశారు. తన రాజీనామా తర్వాత కొత్త సీఎం ఎంపికకు పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. బీజేపీపై ఆయన తీవ్రవ్యాఖ్యలు చేశారు.


‘‘ఆప్‌ను ముక్కలు చేసేందుకే బీజేపీ నన్ను జైలుకు పంపింది. ఆప్‌లో చీలికలు తెచ్చి ఢిల్లీలో గద్దెనెక్కాలని కుట్రలు పన్నింది. కానీ పార్టీని విచ్ఛిన్నం చేయలేకపోయింది’’ అన్నారు. బీజేపీ కుట్రలను ముందే గుర్తించి, రాజ్యాంగాన్ని రక్షించాలనే ఉద్దేశంతోనే తాను ఇంతకాలం రాజీనామా చేయలేదని పేర్కొన్నారు.

‘‘జైలు నుంచి ప్రభుత్వాన్ని ఎందుకు నడపకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలా సర్కారును నడపవచ్చని వెల్లడించింది. ఫిబ్రవరిలో జరగాల్సిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను నవంబరులో నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్‌ చేస్తున్నా. మహారాష్ట్రతోపాటు ఢిల్లీ ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తున్నా. ఇంటింటికీ వెళ్లి ఓట్లడుగుతాను. నేను నిర్దోషినని నమ్మితేనే ఓట్లు వేయాలని ప్రజలను కోరుతాను. సుప్రీంకోర్టు నాకు బెయిలిచ్చింది. ప్రజాకోర్టులో ప్రజలే తీర్పునిస్తారు. నేను దోషినా? నిర్దోషినా? అనేదాన్ని ప్రజలే నిర్ణయిస్తారు. నేను, మనీశ్‌ సిసోడియా ప్రజాకోర్టునే ఆశ్రయిస్తాం. నా నిర్దోషిత్వంపై అంతిమన్యాయనిర్ణేతలు ప్రజలే. రాజీనామా నిర్ణయం నాకు నేను విధించుకుంటున్న అగ్నిపరీక్ష’’ అని ఉద్వేగంగా అన్నారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ కొత్త ఆటను ప్రారంభించిందని మండిపడ్డారు. కర్ణాటకలో సిద్దరామయ్య, కేరళలో పినరయి విజయన్‌, పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీపై కేసులు నమోదు చేశారన్నారు. ‘‘బీజేపీయేతర సీఎంలందరికీ నా విన్నపం ఏమిటంటే కేసులు నమోదుచేస్తే రాజీనామాలుచేయొద్దు’’ అని అన్నారు.


బ్రిటిషర్లు కూడా ఊహించి ఉండరు

దేశాన్ని రెండొందల ఏళ్లు పాలించిన బ్రిటిషర్లు కూడా భవిష్యత్తును ఊహించి ఉండరని కేజ్రీవాల్‌ వ్యంగ్యంగా అన్నారు. ‘‘బ్రిటిషర్లు భవిష్యత్‌లో తమకంటే క్రూరమైన పాలకులు భారత్‌లో ఉంటారని అస్సలు అనుకుని ఉండరు. 75ఏళ్ల స్వతంత్ర భారతంలో అది సాధ్యమైంది’’ అని బీజేపీని ఉద్దేశించి అన్నారు. జైలులో ఎన్నో పుస్తకాలు చదివానని, భగవద్గీతను ఎన్నోసార్లు పఠించానని, భగత్‌సింగ్‌ పుస్తకం (భగత్‌సింగ్‌ కీ జైల్‌ డైరీ)ను చదివానని చెప్పారు. ‘‘భగత్‌సింగ్‌ జైలులో ఉండగా.. తన మిత్రులకు, దేశ యువతకు ఎన్నో లేఖలు రాశారు. బ్రిటిష్‌ పాలకులు వాటిని సంబంధిత వ్యక్తులకు అందేలా చేశారు. నేను జైలు నుంచి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఎన్నో లేఖలు రాశాను. నేను జైలులో ఉన్నందున ఢిల్లీ మంత్రి ఆతిషిని జెండావందనం చేసేందుకు అనుమతించాలని ఓ లేఖలో కోరా. స్పందన లేదు. కానీ నాకు హెచ్చరికలు వచ్చాయి. మరోమారు లేఖరాస్తే ములాఖత్‌లో కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కూడా దక్కదని బెదిరించారు. నాతో ఒకసారి ములాఖత్‌ అయిన సందీప్‌ పాఠక్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఇంతటి నియంతృత్వం రాబోతుందని బ్రిటిషర్లు అప్పట్లో ఊహించి ఉండరు’’ అని కేజ్రీవాల్‌ అన్నారు.


  • అది గిమ్మిక్కే: కాంగ్రెస్‌

కేజ్రీవాల్‌ రాజీనామా నాటకం ఓ గిమ్మిక్కేనని కాంగ్రెస్‌ నేత సందీప్‌ దీక్షిత్‌ విమర్శించారు. ‘‘కేజ్రీవాల్‌ రాజీనామాకు మేము ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నాం. ఇప్పుడు గిమ్మిక్కుల్లో భాగంగా రాజీనామా ప్రకటన చేశారు. కేజ్రీవాల్‌ బెయిల్‌పై విడుదలయ్యాక ఆయనను సీఎంవోకు వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాంటి బెయిల్‌ షరతులను గతంలో ఏ సీఎం కూడా ఎదుర్కోలేదు’’అని ఆయన అన్నారు.

  • పబ్లిసిటీ కోసం నాటకం: బీజేపీ

కేజ్రీవాల్‌ ప్రకటన పబ్లిసిటీ కోసం ఆడుతున్న నాటకమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్‌ భండారి అన్నారు. సుప్రీంకోర్టు షరతులకు కట్టుబడే ఆయన రాజీనామా చేయాల్సి వస్తోందన్నారు. ‘‘ఆప్‌ అంటేనే అవినీతి పార్టీ అని దేశమంతా తెలుసు. పబ్లిసిటీ స్టంట్‌తో తన ఇమేజ్‌ను తిరిగి పొందాలని కేజ్రీవాల్‌ ప్రయత్నాలు మొదలుపెట్టారు’’ అని అన్నారు.


  • హరియాణాపై కేజ్రీవాల్‌ దృష్టి

    ఢిల్లీ సీఎం బాధ్యతల నుంచి తప్పుకొన్నాక కేజ్రీవాల్‌ పూర్తిగా హరియాణా ఎన్నికలపై దృష్టిసారిస్తారని తెలుస్తోంది. రైతు ఉద్యమాల నేపథ్యంలో హరియాణాలో బీజేపీకి గడ్డుకాలమున్నట్లు విశ్లేషణలు వస్తుండగా.. దాన్ని అనుకూలంగా మలచుకునేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోంది. హరియాణాపై తమ పార్టీ జెండా ఎగురవేయాలనుకుంటోంది. అయితే ఫలితాలను తారుమారుచేసి ఆప్‌కు పట్టం కట్టబెట్టే దిశలో కేజ్రీవాల్‌ పక్కా వ్యూహంతో ఉన్నట్ట్టు సమాచారం. హరియాణాలో పొత్తుపై ఇండియా కూటమితో చర్చలు విఫలమవడంతో ఒంటరిపోరుకు కేజ్రీవాల్‌ నిర్ణయించారు. ‘‘ఆప్‌ 2013లో అనూహ్యంగా ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న తర్వాత వరుసగా అధికారం చేపట్టింది. పంజాబ్‌లో పాగా వేసి.. గోవాలో ఓట్ల శాతాన్ని పెంచుకుంది. జాతీయ పార్టీగా ఎదిగింది. హరియాణాలో పాగావేసినా.. చెప్పుకోదగ్గ సీట్లు సాధించినా..ఆప్‌ జాతీయ పార్టీ హోదాకు మరో నాలుగైదేళ్లు ఢోకా ఉండదు. అదే కేజ్రీవాల్‌ వ్యూహంగా కనిపిస్తోంది’’అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

  • ఆతిషికి అవకాశం?

కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? అంటే ఆప్‌ వర్గాలు ఆతిషి వైపే చూపిస్తున్నాయి. కేజ్రీవాల్‌, సిసోడియా వంటివారు జైలులో ఉన్నప్పుడు ఆతిషి పార్టీని చీలిపోకుండా కాపాడారనే అభిప్రాయాలున్నాయి. 2013 ఎన్నికల్లో మ్యానిఫెస్టోను రూపొందించి ఆప్‌ అధికారం చేపట్టడానికి ఆతిషి ప్రధాన కారణం. కేజ్రీవాల్‌ జైలులో ఉన్నప్పుడు పంద్రాగస్టు సందర్భంగా జెండా ఎగురవేసే అవకాశం ఆతిషికి ఇవ్వాలని ఎల్జీకి లేఖ రాయడం ఆమెకున్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. అయితే, సీఎం రేసులో కేజ్రీవాల్‌ భార్య సునీత, ఆప్‌ సీనియర్‌ నేతలు గోపాల్‌ రాయ్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, కైలాశ్‌ గెహ్లోత్‌ పేర్లూ వినిపిస్తున్నాయి.

Updated Date - Sep 16 , 2024 | 02:52 AM

Advertising
Advertising