Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్ పాత్రపై సంచలన విషయాలు వెల్లడించిన ఈడీ
ABN, Publish Date - Mar 22 , 2024 | 03:24 PM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం రాత్రి అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని జడ్జిని ఈడీ కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి 9:05 గంటలకు అరెస్టు చేశామని, 24 గంటల్లోపు అతడిని జడ్జి ముందు హాజరుపరిచినట్టు ఈడీ పేర్కొంది. రిమాండ్ కోరుతూ దరఖాస్తు ఇచ్చామని, అన్ని నిబంధనలను పాటించి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు కోర్టుకు వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టుపై బంధువులకు కూడా సమాచారం అందించామని, అరెస్టుకు సంబంధించిన ఆధారాలను 28 పేజీల్లో రాతపూర్వకంగా అందజేశామని వివరించారు. అరెస్టు పంచనామా కూడా తమ ఉందని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు వెల్లడించారు.
కేజ్రీవాల్ కీలక వ్యక్తి.. డబ్బులు అడిగారు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది. ఇక ఈ కేసులోనే అరెస్టయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ లభించలేదని న్యాయస్థానం దృష్టికి ఈడీ పేర్కొంది. ఈ కేసులో సహ నిందితురాలుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కే.కవిత వాంగ్మూలాన్ని కూడా తీసుకున్నామని ప్రస్తావించింది. ఆప్ మాజీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ విజయ్ నాయర్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్నారని, కేజ్రీవాల్‌తో చాలా సన్నిహితంగా ఉండే విజయ్ నాయర్ మధ్యవర్తిగా నటించాడని ఈడీ పేర్కొంది.
సౌత్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్ డబ్బు డిమాండ్ చేశారని, ఈ విషయాన్ని నిరూపించడానికి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రెండు పర్యాయాలు నగదు బదిలీ జరిగిందని వివరించారు. సౌత్ గ్రూప్‌కు లిక్కర్ పాలసీలో లబ్ది చేకూర్చేందుకు ముడుపులు తీసుకున్నారని వివరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో భాగంగా ఎమ్మెల్సీ కవితను కేజ్రీవాల్ కలిశారని, కలిసి పని చేద్దామంటూ కవితతో సీఎం కేజ్రీవాల్ చెప్పారని ఈడీ పేర్కొంది. విజయ్ నాయర్ అరవింద్ కేజ్రీవాల్ కోసం పనిచేశారని, గోవా ఎన్నికల సమయంలో రూ.45 కోట్లు చేతులు మారాయని కోర్టుకు ఈడీ వెల్లడించింది.
ఈ కేసుకు సంబంధించిన ఆధారాలలో ఫోన్ రికార్డ్స్ కూడా ఉన్నాయని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ తెలిపింది. విజయ్ నాయర్‌కు సంబంధించిన కంపెనీ నుంచి ఆధారాలు సేకరించామని, రూ.45 కోట్లు హవాలా మార్గంలో తరలించినట్టు తేలిందని, పెద్ద మొత్తంలో నిధులు వివిధ వ్యక్తుల ద్వారా చేతులు మారాయని వివరించింది. కాగా ఈ కేసుకు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Mar 22 , 2024 | 03:26 PM