AAP MP Sanjay Singh: కేజ్రీవాల్, సిసోడియా అమాయకులు, జైలు నుంచే పాలన..
ABN , Publish Date - Apr 05 , 2024 | 02:36 PM
ఎక్సైజ్ పాలసీ కేసులో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అమాయకులని 'ఆప్' ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. జైలు నుంచే ఆప్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసు (Excise policy case)లో జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) అమాయకులని 'ఆప్' ఎంపీ సంజయ్ సింగ్ (Sanjay Singh) అన్నారు. జైలు నుంచే ఆప్ ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న కేజ్రీవాల్ అరెస్టు కాగా, ఇదే కేసులో అరెస్టయిన సంజయ్ సింగ్ ఇటీవల బెయిలుపై విడుదలయ్యారు.
తప్పుడు సాక్ష్యాలతోనే..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తప్పుడు సాక్ష్యాలతోనే కేసులు నమోదు చేసినట్టు సంజయ్ సింగ్ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. బెయిలు పొందడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని అడిగినప్పుడు లీగల్ ప్రక్రియలో ఒదొక భాగమని, పీఎంఎల్ఏ చట్టం కింద బెయిల్ లభించడం ఒకింత కష్టమని చెప్పారు. కేసు విచారణలో ఉన్నందున ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని చెప్పారు. కేజ్రీవాల్‌పై కేసుకు సంబంధించి మాట్లాడుతూ, ఈడీ, సీబీఐలు మొత్తం 456 సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను రికార్డు చేశాయని, కేవలం నలుగురే సీఎం పేరును ప్రస్తావించారన్నారు. కేజ్రీవాల్ నీతివంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి అని, పిల్లలకు ఉత్తమ విద్య, ఢిల్లీ ప్రజలకు చక్కటి ఆరోగ్య సౌకర్యాలు కల్పించడమే ఆయన లక్ష్యమని చెప్పారు. జైలులో నుంచి ప్రభుత్వాన్ని నడపడంపై అడిగినప్పుడు, ఎందుకు పాలన సాగించరాదని ప్రశ్నించారు. రాజ్యాంగం కూడా ఇందుకు అనుమతి ఇస్తోందన్నారు. ఎవరూ దీనికి అభ్యంతరం చెప్పలేరని, జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపాలా వద్దా అనేది బీజేపీనో, ఎల్జీనో నిర్ణయించ లేరని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.