Kejriwal: తీహార్ జైలులో కేజ్రీవాల్ దినచర్య ఇలా...
ABN, Publish Date - Apr 01 , 2024 | 02:56 PM
లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా, అప్పట్నించి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా ఆయన కస్టడీని ఏప్రిల్ 15వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు.
న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ (Liquor Policy Scam)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైలు(Tihar Jail)కు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కీలక నేతల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ కేసులో మార్చి 21న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయగా, అప్పట్నించి ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు. తాజాగా ఆయన కస్టడీని ఏప్రిల్ 15వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. కస్టడీ గడువు వరకూ తీహార్ జైలులోని జైల్ నెంబర్-2లో ఆయన ఒక్కరే ఉంటారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా జైల్ నెంబర్-1, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్-7, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్-5లో ఉంటున్నారు. బీఆర్ఎస్ నేత కె.కవిత తీహార్ జైలులోని జైల్ నెంబర్-6 (మహిళా జైలు)లో ఉంటున్నారు.
జైలులో కేజ్రీవాల్ దినచర్య..
కేజ్రీవాల్‌తో పాటు జైలులోని ఇతర ఖైదీల దినచర్య ఉదయం 6.30 గంటలతో మొదలవుతుంది. ఖైదీలకు బ్రేక్‌ఫాస్ట్‌గా టీ, బ్రెడ్ ముక్కలు ఇస్తారు. ఆ తర్వాత కేసు విచారణ ఉంటే కోర్టుకు కేజ్రీవాల్ వెళ్తారు. లేదంటే తన న్యాయవాదుల బృందంతో సమావేశమవుతారు. 10.30 నుంచి 11 గంటల వరకూ మధ్యాహ్న భోజనం (లంచ్) ఉంటుంది. పప్పు, సబ్జీ, ఐదు రొట్టెలు లేదా రైస్ ఇస్తారు. ఆ తర్వాత 3 గంటల నుంచి ఖైదీలను సెల్‌లోనే ఉంచుతారు. 3.30 గంటలకు టీ, రెండు బిస్కట్లు ఇస్తారు. 4 గంటలకు తమ లాయర్లను కలవవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఎర్లీ డిన్నర్ ఉంటుంది. రాత్రి 7 గంట నుంచి జైలుగదిలోనే ఉంచుతారు.
జైలులో సౌకర్యాలు
కేజ్రీవాల్‌కు జైలులో టీవీ చూసే సౌకర్యం కల్పించారు. వార్తలు, వినోదం, క్రీడలు సహా 18 నుంచి 20 ఛానెల్స్ చూసే అవకాశం ఉంది. 24 గంటలూ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్ కావడంతో కేజ్రీవాల్‌కు జైలులో రెగ్యులర్‌గా మెడికల్ చెకప్‌లు ఉంటాయి. కుటుంబ సభ్యులను వారంలో రెండుసార్లు కలుసుకునే వీలు కల్పించారు. కుటుంబ సభ్యుల జాబితాను నిర్ధారించుకున్న తర్వాతే జైలు భద్రతా సిబ్బంది వారికి అనుమతి ఇస్తారు. తీహార్‌లో మొత్తంగా 16 జైళ్లు ఉండగా, 20,000 మంది ఖైదీలకు ఇందులో చోటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Apr 01 , 2024 | 02:57 PM