కోడలిని టీవీ చూడొద్దనడం క్రూరత్వం కాదు

ABN, Publish Date - Nov 10 , 2024 | 03:32 AM

అత్తింటి వారు కోడలిని టీవీ చూడనీయకపోవడం, చాపపై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ స్పష్టం చేసింది.

కోడలిని టీవీ చూడొద్దనడం క్రూరత్వం కాదు

న్యూఢిల్లీ, నవంబరు 9: అత్తింటి వారు కోడలిని టీవీ చూడనీయకపోవడం, చాపపై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కిందకు రావని బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఆ మహిళ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో భర్త, అత్తింటి వారికి కింది కోర్టు విధించిన 20 ఏళ్ల జైలు శిక్షను రద్దు చేసి ఊరట కల్పించింది. తమ కూతురిని అత్తింటి వారు తీవ్రంగా వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబీకులు ఆరోపించారు. టీవీ చూడనిచ్చే వారు కాదని.. గుడికి కూడా వెళ్లనీయకపోయే వారని.. తెల్లవారు జామున 1.30 గంటలకు లేపి మంచి నీరు పట్టమనే వారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై అత్తింటి వారు స్పందిస్తూ.. తమ ప్రాంతానికి ఆ సమయంలోనే మంచి నీరు వచ్చేదని.. తాము కూడా కోడలితో పాటు నీరు పట్టే వారమన్నారు. అయితే ఇవన్నీ ఇంటి వ్యవహారాలని.. ట్రయల్‌ కోర్టు పేర్కొన్నట్లు 498 (ఏ) ప్రకారం మానసిక, శారీరక క్రూరత్వం కిందకు రావని హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె ఆత్మహత్యకు కారణం అత్తింటి వారేనని చెప్పేందుకు ఏ ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. దీంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

Updated Date - Nov 10 , 2024 | 03:32 AM