Bhuvaneshwar : అదిగో జగన్నాథుడి ఖజానా!
ABN, Publish Date - Jul 14 , 2024 | 03:06 AM
ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
నేడు తెరుచుకోనున్న పూరీ ఆలయ రత్నభాండాగారం.. రహస్య గదిలోకి వెళ్లనున్న 16మంది సభ్యుల బృందం
46 సంవత్సరాల తర్వాత సంపద లెక్కింపునకు ఏర్పాట్లు
భువనేశ్వర్, జూలై 13: ఒడిశా రాష్ట్రం పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం నేడు తెరుచుకోనుంది. దాదాపు 46 సంవత్సరాల తర్వాత ఈ గదిలో భద్రపరిచిన విలువైన ఆభరణాలను, ఇతర వస్తువులను లెక్కించడానికి ఒడిశా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. చివరిసారిగా ఈ ఖజానాను 1978లో తెరిచి, అందులోని సంపదను లెక్కించారు. అప్పట్లో ఈ లెక్కింపు ప్రక్రియ 70 రోజుల పాటు కొనసాగింది. తాము అధికారంలోకి వస్తే భాండాగారాన్ని తెరిపిస్తామని ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ హామీ ఇచ్చింది.
]ఈ నేపథ్యంలోనే ఒడిశా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. జూలై 14న భాండాగారాన్ని తెరవాలని ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. 14న ఉదయం కమిటీ సభ్యులంతా సంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి ప్రవేశించి తొలుత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఖజానా ఉన్న గదిలోకి అధీకృత సిబ్బందితో పాటు పాములు పట్టే వ్యక్తి మొదటగా ప్రవేశిస్తారు. నాలుగు దశాబ్దాలకు పైగా మూసి ఉన్న గదిని తెరవనుండటంతో అందులో భారీ విష సర్పాలు ఉంటాయన్న ఆందోళన నెలకొంది.
ఒకవేళ విషపురుగు కాటు వేసినా సత్వర చికిత్స కోసం వైద్య సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. భాండాగారంలోకి ప్రవేశించే కమిటీ సభ్యులందరూ గత వారం రోజులుగా శాకాహారం మాత్రమే భుజిస్తూ, పూర్తి నియమ నిష్టలు పాటిస్తున్నారు. ఖజానాలోని ఆభరణాల గుర్తింపు ప్రక్రియను స్వర్ణకారులతో పాటు వాతావరణ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో చేపట్టనున్నట్లు జస్టిస్ రథ్ తెలిపారు. రహస్య గదులకు ఏఎస్‌ఐ మరమ్మతులు చేపట్టనుండటంతో అక్కడే లెక్కింపు సాధ్యం కాదని, అందులోని సంపదను ఆలయంలోనే మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించి పటిష్ఠ భద్రత ఏర్పాట్ల నడుమ లెక్కిస్తామని వివరించారు. ఈ మొత్తం ప్రక్రియను వీడియో రూపంలో భద్రపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో భక్తులకు దర్శనాలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
రత్నభాండాగారం విశేషాలివీ...
జగన్నాథుడి ఆలయంలోని జగమోహన సమీపంలో రత్నభాండాగారం ఒక చిన్న ఆలయం తరహాలో ఉంటుంది. దీని ఎత్తు 11.78 మీటర్లు. ఇందులో దేవతామూర్తుల ఆభరణాలను భద్రపరిచేందుకు బహరా భాండార్ (బాహ్య గది), భితరా భండార్ (లోపలి గది) అనే రెండు గదులు ఉంటాయి. బయటి గది కంటే లోపలి గది బాగా విశాలంగా ఉంటుంది. స్వామివారి నిత్య పూజల్లో ఉపయోగించే ఆభరణాలు బయటి గదిలో ఉంటాయి.
గత కొన్ని శతాబ్దాలుగా ఒడిశాను పాలించిన అనేక రాజవంశాలకు చెందిన రాజులతో పాటు నేపాల్ పాలకులు సైతం ఇక్కడి స్వామికి ‘అరుదైన వాటిలో అత్యంత అరుదైన’ బంగారు, వెండి, వజ్రాలు వంటి విలువైన సంపదను విరాళంగా ఇచ్చారు. యుద్ధాల్లో గెలుచుకున్న అంతులేని ధనరాశులను స్వామికి కానుకలుగా సమర్పించారు. వీటిని లోపలి గదిలో భద్రపరిచారు.
2018లో 16మంది సభ్యుల బృందం రహస్య గది తలుపులు తెరిచేందుకు వెళ్లింది. అయితే అప్పట్లో భాండాగారం తాళం చెవి అందుబాటులో లేకపోవడంతో వారు లోపలకు ప్రవేశించడం సాధ్యపడలేదు. కేవలం ఫ్లాష్ లైట్ల వెలుగులో కిటికీ ద్వారా గది లోపలి భాగాన్ని పరిశీలించి వెనుదిరిగారు.
రహస్య గదిలో ఏముందంటే
జగన్నాథ స్వామికి చెందిన వజ్ర వైడ్యూర్యాలు, స్వర్ణాభరణాలు, వెండి వస్తువులను 15 చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. ఒక్కో పెట్టె 9 అడుగుల పొడవు, 3 అడుగుల ఎత్తు ఉంటుంది.
1805లో అప్పటి పూరీ కలెక్టర్ చార్లెస్ గ్రోమ్ రూపొందించిన నివేదికలో రత్నభాండాగారపు అధికారిక సమాచారం మొదటిసారిగా బహిర్గతమైంది. రత్నాలు, మేలిమి బంగారం, వెండితో కూడిన 64 ఆభరణాలతో పాటు 128 బంగారు నాణేలు,1,297 వెండి నాణేలు, 106 రాగి నాణేలు ఉన్నాయని ఆ నివేదికలో పేర్కొన్నారు.
1950 తర్వాత శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చట్టం అమలులోకి వచ్చినప్పుడు రూపొందించిన రికార్డు ఆఫ్ రైట్స్ ప్రకారం.. బయటి గదిలో 150 బంగారు ఆభరణాలు, లోపలి గదిలో 180 రకాల ఆభరణాలు, 146 వెండి వస్తువులున్నాయి.
1978లో చివరిసారిగా రూపొందించిన జాబితా ప్రకారం రత్నభాండాగారంలోని రెండు గదుల్లో విలువైన రాళ్లు పొదిగిన 128.380 కిలోల బరువైన 454 బంగారు ఆభరణాలు, 221.530 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. ఆ తర్వాత 1982, 1985లలో రెండుసార్లు లోపలి గదిని తెరిచినా ఆభరణాల ఆడిట్ నిర్వహించలేదు.
Updated Date - Jul 14 , 2024 | 03:06 AM