Lok Sabha Elections: బహిరంగంగా పచ్చి అబద్ధాల చెప్పే ప్రధానిని మొదటి సారి చూశా: ప్రియాంక ఫైర్
ABN, Publish Date - Apr 27 , 2024 | 09:07 PM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు.
అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ప్రధానులతో పాటు ఎందరో ప్రధానులను తాను చూశానని, కానీ బహిరంగంగా పచ్చి అబద్ధాలు చెప్పే ప్రధానిని చూడటం మాత్రం ఇదే మొదటిసారని అన్నారు. ''సంపద పంపిణీ'' హామీ పేరుతో కాంగ్రెస్ పార్టీ మహిళల మంగళసూత్రాలు కూడా ఊడలాక్కుంటుందంటూ మోదీ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసి భయంతోనే ఆయన ఇలాంటి ఆరోపణలకు దిగుతున్నారని తప్పుపట్టారు. గుజరాత్‌లోని వల్సద్ జిల్లా ధర్మపూర్ గ్రామంలో శనివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రియాంక మాట్లాడారు.
''మా కుటుంబ సభ్యులే దేశానికి సేవ చేశారని నేను చెప్పడం లేదు. వారితో పాటు దేశం కోసం పనిచేసిన పలువురు ప్రధానమంత్రులను నేను చూశాను. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. రాజీవ్ గాంధీ కూడా ప్రధానిగా సేవలందించారు. ఆయన చనిపోయినప్పుడు ముక్కలైన ఆ దేహాన్ని మా ఇంటికి తీసుకువచ్చారు. మన్మోహన్ సింగ్ సంస్కరణల విప్లవం తీసుకువచ్చారు. వాజ్‌పేయి రాజనీతిజ్ఞులు. కానీ, బహిరంగంగా అబద్ధాలు చెప్పే ప్రధానిని తొలిసారి చూస్తున్నా. వాళ్లు నా కుటుంబ సభ్యులను దూషించారు. మేము వాటిని పట్టించుకోం. మావి ఉక్కు గుండెలు, నకిలీ 56 అంగుళాల ఛాతీలు కావు'' అని పరోక్షంగా మోదీపై విమర్శలు గుప్పించారు.
Lok Sabha Elections 2024: అమ్మేది ఈ ఇద్దరు...కొనేది ఆ ఇద్దరు
విపక్షాలపై దాడి చేయని రోజులేదు..
విపక్ష నేతలను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ప్రియాంక గాంధీ విమర్శించారు. ''ప్రజాస్వామ్యాన్ని మోదీ బలహీనపరుస్తున్నారు. ప్రతిరోజూ విపక్షాలపై దాడులు చేస్తున్నారు. కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్లను ఆయన స్తంభింపజేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు జైలులో ఉన్నారు. నా సోదరుడిని కూడా దాదాపు పార్లమెంటు నుంచి గెంటేసేంత పని చేశారు. ఇటీవలే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 150 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. మోదీజీ ఒక్కడే మరి నిజాయితీపరుడు'' అని ప్రియాంక ఆక్షేపించారు. కాగా, గుజరాత్‌లోని 25 పార్లమెంటు స్థానాలకు మూడో విడత ఎన్నికల్లో భాగంగా మే 7న పోలింగ్ జరుగనుంది.
Read Latest National News and Telugu News
Updated Date - Apr 27 , 2024 | 09:10 PM