Budget : మహిళలకు మరింత ప్రోత్సాహం
ABN, Publish Date - Jul 24 , 2024 | 05:17 AM
దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్రను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా మహిళలు, బాలికలను ప్రోత్సహించేందుకు 2024-25 బడ్జెట్‌లో...
బడ్జెట్‌లో రూ.3 లక్షల కోట్ల కేటాయింపు
న్యూఢిల్లీ, జూలై 23: దేశ ఆర్థిక అభివృద్ధిలో మహిళల పాత్రను మరింతగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దిశగా మహిళలు, బాలికలను ప్రోత్సహించేందుకు 2024-25 బడ్జెట్‌లో వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా రూ.3 లక్షల కోట్లకు పైగా కేటాయించింది. ఇందులో.. మహిళా, శిశు అభివృద్ధి (డబ్ల్యూసీడీ) మంత్రిత్వ శాఖకు రూ.26,092 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.25,448 కోట్లు కేటాయించింది. ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వర్కింగ్ ఉమెన్ కోసం ప్రత్యేక హాస్టళ్లను ఏర్పాటు చేసి.. వివిధ కార్యక్రమాల్లో వారిని భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోనుంది.
దీంతోపాటు మహిళల సంక్షేమం, సాధికారతకు సంబంధించి సక్షమ్ అంగన్వాడీ పోషణ్ 2.0, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి పథకాలను కొనసాగించాలని నిర్ణయించింది. శిశువులు, కౌమార బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఉద్దేశించిన సక్షమ్ అంగన్వాడీ 2.0 పథకానికి బడ్జెట్‌లో కేంద్రం రూ.21,200 కోట్లు కేటాయించింది. ఇక శిశు సంక్షేమం, భద్రతకు సంబంధించి మిషన్ వాత్సల్య పథకం కింద చేపట్టే కార్యక్రమాలకు కోసం రూ.1,472 కోట్ల కోటాయింపులు జరిపింది. కాగా, మహిళా సాధికారత లక్ష్యంగా చేపట్టే ‘మిషన్ శక్తి’ని సంబల్, సామర్థ్య పథకాలుగా విభజించి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ఇందుకుగాను ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.3,145 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సంబల్ పథకం కింద.. బేటీ బచావో-బేటీ పఢావో, మహిళల భద్రతకు సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. వీటికోసం రూ.629 కోట్లను వినియోగించనున్నట్లు బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇక సామర్థ్య పథకం కింద ఉమెన్ హాస్టళ్లతోపాటు స్వధార్ గృహ, ప్రధాన మంత్రి వందన వంటి కార్యక్రమాలు చేపడతారు. ఇందుకు రూ.2,516 కోట్లు కేటాయించారు.
గత బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.2,325 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇవే కాకుండా.. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కో ఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఐపీసీసీడీ)కి, సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ ఏజెన్సీ (సీఏఆర్‌ఏ)కి కూడా నిధుల కేటాయింపును పెంచారు. ఇందులో.. శిశు అభివృద్ధికి సంబంధించి పరిశోధన, శిక్షణ కార్యక్రమాలు చేపట్టే ఎన్‌ఐపీసీసీడీకి రూ.88.87 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, బాలల దత్తతపై పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలు నిర్వర్తించే సీఏఆర్‌ఏకు రూ.11.40 కోట్లు వినియోగించనున్నట్లు పేర్కొంది. ఇక మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన నిర్భయ నిధికి రూ.500 కోట్లు కేటాయించింది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేసే యునిసెఫ్‌కు భారత్ భాగస్వామ్యంగా రూ.5.60 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది.
Updated Date - Jul 24 , 2024 | 05:18 AM