ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Supreme Court: బుల్డోజర్‌ న్యాయానికి సుప్రీం బ్రేక్‌!

ABN, Publish Date - Nov 14 , 2024 | 06:01 AM

‘‘అధికారి న్యాయమూర్తిలా వ్యవహరించి, ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు. అలా నిర్ధారించి అతని నివాస/వాణిజ్య భవనాలను కూల్చివేసి, శిక్షించాలని నిర్ణయించడానికీ వీల్లేదు. అలాంటి అధికారం కార్యనిర్వాహక అధికారికి లేదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా నిర్ధారించారన్న కారణంతో నిబంధనలను

Supreme Court of India

  • అధికారులేమీ జడ్జిలు కాదు.. ఇంటిని కూల్చే అధికారం లేదు

  • దోషి అయినా.. కూల్చడానికి వీల్లేదు

  • కూల్చివేతల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే

  • అధికారుల జీతాల నుంచి పరిహారం

  • రాష్ట్రాలు, అధికారులు హద్దు మీరొద్దు

  • ఒక వ్యక్తి నిందితుడైతే.. కూల్చివేతలతో

  • ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం సరికాదు

  • నిర్మాణాల కూల్చివేతలపై సుప్రీం తీర్పు

  • ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించే

  • కట్టడాలకు తీర్పు వర్తించదని స్పష్టీకరణ

  • నోటీసిచ్చి.. 15 రోజుల గడువు ఇవ్వాలి

  • దేశమంతా వర్తించేలా మార్గదర్శకాలు

అధికారులేమీ జడ్జిలు కాదు. ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించి, ఇళ్లను కూల్చివేసే అధికారం లేదు. సొంత ఇల్లు అన్నది సామాన్యుల కల. దాన్ని నెరవేర్చుకోవడంలో ఎన్నో ఏళ్ల శ్రమ ఉంటుంది. నిందితులకు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి. ఒక వ్యక్తి దోషి అయితే, మిగిలిన కుటుంబ సభ్యులందరినీ రోడ్డున పడేయడం సరికాదు. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లే

- సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘‘అధికారి న్యాయమూర్తిలా వ్యవహరించి, ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించలేరు. అలా నిర్ధారించి అతని నివాస/వాణిజ్య భవనాలను కూల్చివేసి, శిక్షించాలని నిర్ణయించడానికీ వీల్లేదు. అలాంటి అధికారం కార్యనిర్వాహక అధికారికి లేదు’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా నిర్ధారించారన్న కారణంతో నిబంధనలను అనుసరించకుండా ఓ వ్యక్తి ఇంటిని కూల్చడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తుల్నిబుల్డోజర్లతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ‘బుల్డోజర్‌ న్యాయాని’కి బ్రేకులు వేసింది.

ఆస్తుల కూల్చివేతకు సంబంధించి దేశవ్యాప్తంగా అమలయ్యేలా మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అధికారులు ఒక వ్యక్తిని దోషిగా తేల్చలేరని, న్యాయమూర్తిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ప్రభుత్వ అధికారులు హద్దుమీరి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని ధర్మాసనం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల వేతనాల నుంచి వసూలు చేయాలని ధర్మాసనం తన 95 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. తీర్పు రాసే ముందు జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ప్రజల సొంత ఇంటి కలపై ప్రముఖ హిందీ కవి ప్రదీప్‌ రాసిన కవితను ఉటంకించారు. ‘‘సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. ఇది ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంటుంది. ఏ ఒక్కరూ తమ కల (సొంత ఇల్లు)ను కోల్పోవాలని ఎప్పుడూ కోరుకోరు’’ అని పేర్కొంటూ తీర్పును ప్రారంభించారు. సొంత ఇల్లు అనేది ఓ వ్యక్తి లేదా కుటుంబం ఆశ, కల అని.. అది వారి స్థిరత్వం, భద్రతకు సంబంధించిన అంశం కూడా అని ధర్మాసనం పేర్కొంది.

కుటుంబం లేదా కుటుంబాల ఆవాసాన్ని కూల్చేసే అధికారం ఓ అధికారికి ఉంటుందా? అన్నది ప్రశ్న అని.. అలాగే ఓ వ్యక్తి దోషి అయినంత మాత్రాన కుటుంబం మొత్తాన్ని శిక్షించడం సరికాదని స్పష్టం చేసింది. ఇల్లు అనేది పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలిపింది. స్థానిక మునిసిపల్‌ చట్టాలను ఉల్లంఘించిన వారి ఆస్తులనే కూల్చివేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలపగా.. చట్టాలను ఉల్లంఘించిన వారందరి ఇళ్లనూ కూల్చలేదని, కొందరివి మాత్రమే కూల్చారని ధర్మాసనం పేర్కొంది. తమ తీర్పు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని తెలిపింది. ఈ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు సర్క్యులర్లు జారీ చేయాలని ఆదేశించింది.


మార్గదర్శకాలు ఇవే..

  • షోకాజ్‌ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టరాదు. ఒకవేళ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేస్తే.. వాటిపై అప్పీలుకు వెళ్లేందుకు యజమానులకు సమయం ఇవ్వాలి.

  • ఎలాంటి గడువూ ఇవ్వకుండా రాత్రికిరాత్రే ఇళ్లు కూల్చివేయడం సరికాదు. మహిళలు, చిన్నారులు రోడ్లపైకి రావడం మంచిది కాదు.

  • ప్రభుత్వ ఆస్తుల్లో నిర్మించిన అక్రమ కట్టడాలు లేదా కూల్చివేయాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన నిర్మాణాలకు ఈ ఆదేశాలు వర్తించవు.

  • షోకాజ్‌ నోటీసులు ఇళ్లు/భవనాల వెలుపల అతికించాలి. కూల్చివేతకు 15 రోజులు ముందుగానే నోటీసు ఇవ్వాలి. నోటీసు ఇచ్చిన తర్వాత, దాని గురించి జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాలి.

  • మునిసిపల్‌ భవనాల కూల్చివేతలకు గాను కలెక్టర్లు నోడల్‌ అధికారులను నియమించాలి.

  • నిర్మాణాల్లో ఎలాంటి ఉల్లంఘనకు పాల్పడ్డారు? వ్యక్తిగత విచారణకు నిర్ణయించిన తేదీ? దాన్ని ఎవరు నిర్ధారించారు? వంటి వివరాలన్నీ నోటీసులో ఉండాలి. మునిసిపల్‌ అధికారులు మూడు నెలల్లో డిజిటల్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి. జారీ చేసిన ఆదేశాలు, నోటీసుల వివరాలను డిజిటల్‌ పోర్టల్‌లో పెట్టాలి.

  • అధికారులు బాధితుల వాదనలను వినాలి. సంబంధిత మినిట్స్‌ను రికార్డు చేయాలి. ఆ తర్వాతే తుది ఆదేశాలు జారీ చేయాలి. అక్రమ కట్టడం పూర్తిగా కూల్చేస్తారా? పాక్షికంగా కూల్చుతారా? అసలు కూల్చివేయాలన్న తీవ్రమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న వివరాలను తెలియజేయాలి. పూర్తి వివరాలతో కూడిన తుది ఆదేశాలను డిజిటల్‌ పోర్టల్‌లో పెట్టాలి.

  • అక్రమ కట్టడాలని తేలితే వాటిని 15 రోజుల్లోగా కూల్చివేయడం లేదా తొలగించడానికి సంబంధిత యజమానికి అవకాశం ఇవ్వాలి. ఆలోపు అప్పీలేట్‌ సంస్థ స్టే ఇవ్వకపోతే కూల్చివేతలు చేపట్టాలి. కూల్చివేత ప్రక్రియను వీడియో తీయడంతో పాటు దాన్ని భద్రపరచాలి.

  • కోర్టు ఆదేశాలను పాటించని అధికారులపై ధిక్కరణ చర్యలు ఉంటాయి. కూల్చిన ఆస్తుల పునరుద్ధరణ, బాధితులకు పరిహారాన్ని సంబంధిత అధికారులే చెల్లించాల్సి ఉంటుంది.

  • అన్ని రాష్ట్రాల సీఎస్‌లకు ఈ ఆదేశాలివ్వాలి.


ఎన్నో ఏళ్ల కల..

‘‘ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు ఉంటాయి. అందులో వారి భవిష్యత్తు, భద్రత ఇమిడి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడు అయితే.. అక్కడ నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారు..?’’ అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇల్లు, భవనాలను కూల్చే అధికారం కార్యనిర్వాహక అధికారులకు లేదని స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు చేపట్టరాదని ఆదేశించింది. షోకాజ్‌ నోటీసులు జారీ చేయకుండా కూల్చివేతలు చేపట్టరాదని.. అక్రమ కట్టడాల తొలగింపునకు ఇంటి యజమానికి 15 రోజుల గడువు ఇవ్వాలని పేర్కొంది. అయితే తమ ఆదేశాలు ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అక్రమ కట్టడాలకు వర్తించవని స్పష్టం చేసింది. ఏదైనా కేసులో నిందితుడు లేదా దోషిగా తేలినప్పటికీ.. వారికి కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు వర్తిస్తాయని ధర్మాసనం పేర్కొంది.

న్యాయసూత్రాల ప్రకారం ఒక వ్యక్తి దోషిగా తేలే వరకు అతను అమాయకుడేనని.. ఆలోపే నిర్మాణాలను కూల్చివేయడమంటే మొత్తం కుటంబ సభ్యులను శిక్షించినట్లేనని, రాజ్యాంగం ప్రకారం దానికి అనుమతి లేదని తెలిపింది. కూల్చివేతల నిర్ణయాలు తీసుకునే, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారులు జవాబుదారీగా ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. వ్యక్తుల స్వేచ్ఛను కాపాడడం కూడా ప్రధానమని గుర్తుచేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క నిర్మాణాన్ని కూల్చేసినా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లేనని హెచ్చరించింది. అయితే, రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైలు మార్గాలు, జలాశయాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలకు తమ ఆదేశాలు వర్తించవని స్పష్టం చేసింది.

Updated Date - Nov 14 , 2024 | 07:27 AM