Cash For Votes Row: ఖర్గే, రాహుల్‌కు వినోద్ తావ్డే పరువునష్టం నోటీసులు
ABN, Publish Date - Nov 22 , 2024 | 05:15 PM
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు ఈ క్యాష్-ఫర్-ఓట్స్ వివాదం చెలరేగింది. పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాష్ ఆఘాడి (బీవీఏ) నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. తావ్డే-బీవీఏ నేతలు-కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది.
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ రచ్చ రాజేసిన ఓటుకు నోటు వివాదం (Cash for votes row) ముదురుతోంది. ఈ వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే (Vinod Tawde) లీగల్ చర్యలకు దిగారు. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ తనపై చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆ పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రీనతేలకు పరువునష్టం నోటీసులు పంపారు. తావ్డే తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపారు. కాంగ్రెస్ నేతలు ముగ్గురూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే వారిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ఆ నోటీసు పేర్కొంది.
Indian Navy: జలాంతర్గామిని ఢీకొన్న చేపల వేట పడవ... 11 మంది సురక్షితం, ఇద్దరు గల్లంతు
ఏమిటీ వివాదం?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు ఈ క్యాష్-ఫర్-ఓట్స్ వివాదం చెలరేగింది. పాల్ఘర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత వినోద్ తావ్డే డబ్బులు పంచారంటూ బహుజన్ వికాష్ ఆఘాడి (బీవీఏ) నేత హితేంద్ర ఠాకూర్ ఆరోపించారు. తావ్డే-బీవీఏ నేతలు-కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వివాదానికి సంబంధించిన వీడియో కూడా బయటకు రావడంతో సంచలనమైంది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు, రూ.5 కోట్లు పంచేందుకు విరార్ హోటల్‌కు వినోద్ తావ్డే వచ్చారని పలువురు బీజేపీ నేతలు తనకు సమాచారం ఇచ్చారని, ఆయనను తాను విరార్‌లో చూశానని, ఆయనపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఠాకూర్ డిమాండ్ చేశారు. తావ్డే హోటల్‌లో ఉన్నప్పుడు సీసీటీవీ రికార్డును నిలిపివేశారని, తాము చేసిన విజ్ఞప్తి తర్వాతే సీసీటీవీలను తిరిగి హోటల్ యాజమాన్యం ఆన్ చేసిందని చెప్పారు. ఓటర్లను లోబరుచుకునేందుకు తావ్డే డబ్బులు పంచారని ఆరోపించారు.
రాహుల్, ఖర్గే స్పందనిదే..
కాగా, ఈ వివాదంపై రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. ''మోదీజీ... ఈ 5 కోట్లు ఎవరు సురక్షితంగా (సేఫ్) ఉండేందుకు వచ్చాయి? ఎవరు ఈ ప్రజాధనాన్ని లూటీ చేసి టెంపోలో మీకు పంపారు?'' అని రాహుల్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి మోదీపై ఖర్గే సైతం విమర్శలు గుప్పించారు. డబ్బులు, కండబలంతో మహారాష్ట్రను 'సేఫ్'గా మోదీ ఉంచదలచుకున్నారని, పార్టీ నేతలు రూ.5 కోట్ల నగదుతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారని అన్నారు.
ఆరోపణలను తోసిపుచ్చిన తావ్డే
కాగా, డబ్బులు పంచారన్న ఆరోపణలను తావ్డే తోసిపుచ్చారు. ఎమ్మెల్యేల సమావేశం జరుగుతుండటంతో ఎన్నికల రోజు పాటించాల్సిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఇతర జాగ్రత్తల గురించి వారికే చెప్పేందుకే తాను వెళ్లాలని తెలిపారు. అయితే తాము డబ్బులు పంచుతున్నట్టు బీవీఏ కార్యకర్తలు, ఠాకూర్ అనుకున్నారని, ఎన్నికల కమిషన్, పోలీసుల ఎంక్వయిరీలో అన్నీ తేలుతాయని అన్నారు. తాను 40 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నానని, అందరికీ తానేమిటో తెలుసునని, దీనిపై ఎన్నికల కమిషన్ నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతుందని చెప్పారు.
ఇవి కూడా చదవండి...
Supreme Court: ఢిల్లీ ప్రవేశమార్గాలపై సుప్రీం కీలక ఆదేశాలు
Maharashtra CM: ఎన్నికల ఫలితాలకు ముందే.. పవార్ సీఎం అంటూ పోస్టర్లు, ఊరేగింపులు
Rain Alert: 9 రాష్ట్రాల్లో వడగళ్ల వర్షం హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో పొగమంచు కూడా..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 22 , 2024 | 05:15 PM