Champai Soren: దారుణంగా అవమానించారు.. తట్టుకోలేకపోయా..?
ABN, Publish Date - Aug 18 , 2024 | 09:29 PM
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఏంఏంలో సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ కాక రేపుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నెలన్నర రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తట్టుకోలేక పోతున్నానని వివరించారు. హేమంత్ సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను తెలిపారు.
ఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేఏంఏంలో సీనియర్ నేత, మాజీ సీఎం చంపై సోరెన్ (Champai Soren) కాక రేపుతున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నెలన్నర రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చారు. పార్టీలో తనకు అవమానం జరిగిందని, తట్టుకోలేక పోతున్నానని వివరించారు. హేమంత్ సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలను తెలిపారు.
ఏమన్నారంటే..?
‘హేమంత్ సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేశారు. సీఎల్పీ మీటింగ్‌కు మూడురోజుల ముందు నా కార్యక్రమాలను రద్దు చేశారు. ఓ ముఖ్యమంత్రి కార్యక్రమాలను ఇతరులు రద్దు చేయొచ్చా..? ప్రజాస్వామ్యం అంటే ఇదేనా..? నా నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఘోర అవమానానికి గురయ్యా అని’ చంపో సోరెన్ ఉద్వేగానికి గురయ్యారు.
బాధపడ్డా..
‘సీఎల్పీ సమావేశం తర్వాత చాలా బాధపడ్డా. ఏం జరిగిందో రెండు రోజుల వరకు నాకు అర్థం కాలేదు. నిశ్శబ్దంగా కూర్చొన్నా. సీఎం పదవి చేపట్టినప్పటి నుంచి ఏదైనా తప్పు చేశానా అని ఆలోచించా. అధికారం కోసం ఏ రోజు పాకులాడలేదు. కానీ నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. నా మనుషులు అనుకున్న వారే ఇలా చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన తర్వాత నాకు మూడు ఆప్షన్లు ఉండేవి. రాజకీయాల నుంచి వైదొలగడం, లేదంటే సొంతంగా సంస్థ ఏర్పాటు చేయడం, నాతో నడిచేందుకు ముందుకొచ్చే వారితో ప్రయాణం చేయడం. అలా ఓ నిర్ణయానికి వచ్చా. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కన్నా ముందే మరో పార్టీలో చేరతా అని’ చంపై సోరెన్ స్పష్టం చేశారు.
ఆశ్చర్యపోయా..?
‘సీఎం పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరడంతో ఆశ్చర్యపోయా. అధికారం కోసం నేను ఏ రోజు పాకులాడలేదు. అందుకే వెంటనే పదవికి రాజీనామా చేశా. అది నా ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీసింది. నలభై ఏళ్లకు పైగా పార్టీలో పనిచేస్తే నాకు ఇచ్చిన గుర్తింపు ఇదా..? ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో అవమానానికి గురయ్యా. ఆ తర్వాత ప్రత్యామ్నాయం గురించి ఆలోచించా అని’ చంపై సోరెన్ స్పష్టం చేశారు. చంపై సోరెన్ బీజేపీలో చేరతారని ఊహాగానాలు జోరందకున్నాయి. అందుకోసమే ఢిల్లీ వచ్చారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆయన మాత్రం వ్యక్తిగత కారణాలతో హస్తిన వచ్చానని చెప్పుకుంటున్నారు.
Also Read: Bengaluru Student: పార్టీ నుంచి ఇంటికి వెళ్తున్న యువతిపై దారుణం..
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 18 , 2024 | 09:29 PM