Chennai: బీజేపీతో టచ్‌లో డీఎండీకే, పీఎంకే?
ABN, Publish Date - Mar 12 , 2024 | 11:56 AM
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ(BJP).. తమ కూటమిలోకి బలమైన పార్టీలను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.
- అన్నాడీఎంకేతో కుదరని సర్దుబాట్లు!
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో తీవ్రంగా శ్రమిస్తున్న బీజేపీ(BJP).. తమ కూటమిలోకి బలమైన పార్టీలను ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే(AIADMK) కూటమిలో చేరేందుకు సిద్ధమైన డీఎండీకే, పీఎంకేలను తమవైపు తిప్పుకునేందుకు ఆఖరి యత్నాలు చేపట్టింది. వన్నియార్లలో గట్టి పట్టుకున్న పీఎంకేను, ఇటీవల కన్నుమూసిన విజయకాంత్ స్థాపించిన పార్టీ డీఎండీకేను దరి చేర్చుకుంటే తమకు ఓటుబ్యాంకు గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్న కమలదళం.. ఆ రెండు పార్టీలను కూటమిలో చేర్చుకునేందుకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆ రెండు పార్టీలతో వేర్వేరుగా రహస్య మంతనాలు సాగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. పీఎంకే, డీఎండీకేలు అన్నాడీఎంకేతో రెండు విడతల చర్చలు జరిపినా ఆశించిన సీట్లు లభించలేదు. ఈ రెండు పార్టీలూ రాజ్యసభ సీటు కోసం అన్నాడీఎంకేపై ఒత్తిడి చేశాయి. పీఎంకే అయితే రాజ్యసభ సీటుతోపాటు 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకే కూటమి అధికారంలోకి వస్తే తమ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవినివ్వాలని, ఆ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకం చేయాలని కూడా నిర్బంధించింది. అందుకు అన్నాడీఎంకే ససేమిరా అనడంతో ఆ రెండు పార్టీలు జాతీయ పార్టీ అయిన బీజేపీతో టచ్‌లోకి వెళ్లాయి. ఈ ఎన్నికల్లో మెగా కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ఆ దిశగా తొలుత తన అనుచరులను పంపి పీఎంకేతో రెండుసార్లు చర్చలు జరిపించారు. ఇదే విధంగా ఈ నెల 1న అన్నాడీఎంకే నాయకులు డీఎండీకే నాయకురాలు ప్రేమలతతో చర్చించారు. ప్రేమలత నివాసానికి వెళ్లిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, తంగమణి, కేపీ అన్బళగన్, బెంజిమెన్ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అనంతరం డీఎండీకే నేతలు సైతం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వెళ్లి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డీఎండీకే నాయకులు మీడియాతో మాట్లాడుతూ... ఎట్టకేలకు గెలుపు కూటమిలో చేరామని హర్షం ప్రకటించారు. దీంతో అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే చేరినట్లేనని అన్ని వర్గాలు భావించాయి. కానీ ఆ తరువాత జరిగిన పరిణామాలతో ప్రేమలత మాట మార్చారు. అన్నాడీఎంకేతో జరిగిన చర్చలు మర్యాదపూర్వకమే తప్ప పొత్తును ఖరారు చేసుకోలేదని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అయితే తాము అడిగినట్లుగా రాజ్యసభ సీటు ఇచ్చేందుకు అన్నాడీఎంకే విముఖత వ్యక్తం చేయడంతో ప్రేమలత పొత్తు నుంచి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో గత రెండు రోజులుగా డీఎండీకే నేతలు బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకులతో రహస్యంగా భేటీ అయినట్లు తెలిసింది.
రాందాస్‌తో కేంద్రమంత్రుల భేటీ...
పీఎంకేని బీజేపీ కూటమిలో చేర్చుకునే దిశగా కేంద్ర మంత్రులు సోమవారం ఉదయం ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ రాందా్‌సను టి.నగర్‌లోని ఆయన నివాసంలో కలుసుకున్నారు. కేంద్రమంత్రులు వీకే సింగ్, కిషన్‌రెడ్డి తదితర జాతీయ నాయకులు ఆదివారం రాత్రి నగరానికి విచ్చేశారు. గిండీలోని స్టార్‌హోటల్‌లో బస చేసిన కేంద్ర మంత్రులను మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) కలుసుకుని చర్చలు జరిపారు. ఆ చర్చల పర్యవసానంగా బీజేపీ కూటమిలో ఓపీఎస్ వర్గం స్థానం పొందింది. ఈ నేపథ్యంలో సోమవారం కేంద్రమంత్రులు వీకే సింగ్, కిషన్‌రెడ్డి, ఎల్. మురుగన్, మాజీ మంత్రి పొన్‌రాధాకృష్ణన్ తదితరులు టి.నగర్‌లోని రాందాస్ నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా సీట్ల సర్దుబాట్లపై చర్చ జరిగింది. ఈ నెల 15న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తుండటంతో ఆ లోపున పీఎంకే తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని కేంద్ర మంత్రులు సూచించినట్లు తెలుస్తోంది.
Updated Date - Mar 12 , 2024 | 11:56 AM