Chennai: అయ్యో ఎంత పనైందే.. చిలుక జోస్యుడి అరెస్టు.. అసలు విషయం ఏంటో తెలిస్తే...
ABN, Publish Date - Apr 10 , 2024 | 10:49 AM
కడలూరు పీఎంకే అభ్యర్థి, ప్రముఖ తమిళ సినీ దర్శకుడు తంగర్‌బచ్చన్(Film director Tangerbachchan)కు నాలుగు మంచి మాటలు చెప్పిన చిలుక జోస్యుడిని పోలీసులు అరెస్టు చేశారు.
చెన్నై: కడలూరు పీఎంకే అభ్యర్థి, ప్రముఖ తమిళ సినీ దర్శకుడు తంగర్‌బచ్చన్(Film director Tangerbachchan)కు నాలుగు మంచి మాటలు చెప్పిన చిలుక జోస్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మధ్యాహ్నం తంగర్‌బచ్చన్ ఓట్ల వేట సాగిస్తూ ఓ చెట్టు నీడన సేదతీరారు. ఆ సమయంలో ఆ చెట్టు కిందే ఉన్న చిలుక జోస్యుడిని గమనించి తనకు జోస్యం చెప్పమని అడిగారు. ఆ చిలుక జోస్యుడు బోనులో ఉన్న చిలుకను బయటకు రప్పించి అయ్యనార్ చిత్రపటం కలిగిన చిట్టాను చూపారు. అయ్యనార్ పటం రావటంతో ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తారంటూ తంగర్‌బచ్చన్‌కు తెలిపారు. ఆ మాటలకు సంతోషించిన తంగర్‌బచ్చన్ ఆ చిలుక జోస్యుడికి చిల్లర ఇచ్చి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తంగర్‌బచ్చన్ చిలుక జోస్యం చూస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఆ చిలుక జోస్యుడిని అరెస్టు చేశారు. చిలుకను బోనులో నిర్బంధించడం నేరమని చెబుతూ ఆ జోస్యుడి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆ ప్రాంతంలోనే సంచరిస్తున్న మరో ఇద్దరు చిలుక జోస్యులను కూడా అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తమ పార్టీ అభ్యర్థి తంగర్‌బచ్చన్‌కు జోస్యం చెప్పిన చిలుక జోస్యుడిని అరెస్టు చేయడం డీఎంకే ప్రభుత్వ కక్ష సాధింపు చర్యేనని పీఎంకే నాయకుడు అన్బుమణి రాందాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదికూడా చదవండి: BJP leader: బీజేపీ నాయకుడి ఇంట్లో పోలీసుల సోదాలు
Updated Date - Apr 10 , 2024 | 10:49 AM