ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CJI : మనసు నొప్పించి ఉంటే క్షమించండి

ABN, Publish Date - Nov 09 , 2024 | 05:19 AM

పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ శుక్రవారం భావోద్వేగానికి లోనయ్యారు. విధి నిర్వహణలో నొప్పించి ఉంటే మన్నించాలని కోరారు. మరోవైపు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ అనుభవాలను గుర్తు చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు.

  • కావాలని ఏమీ చేయలేదు

  • సర్వీస్‌లో చివరి రోజు జస్టిస్‌ చంద్రచూడ్‌ భావోద్వేగం

  • సీజేఐకి ఘనంగా వీడ్కోలు పలికిన జడ్జిలు, లాయర్లు

న్యూఢిల్లీ, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): పదవీ కాలం పూర్తయిన సందర్భంగా సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ శుక్రవారం భావోద్వేగానికి లోనయ్యారు. విధి నిర్వహణలో నొప్పించి ఉంటే మన్నించాలని కోరారు. మరోవైపు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ అనుభవాలను గుర్తు చేసుకొని ఆయన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. చివరి రోజున జస్టిస్‌ చంద్రచూడ్‌తో పాటు తదుపరి సీజే జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, ఇతర న్యాయమూర్తులు జస్టిస్‌ హృషికేష్‌, జస్టిస్‌ నరసింహ, జస్టిస్‌ పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌లతో కలిసి ప్రధాన న్యాయమూర్తి లాంఛనపూర్వక ధర్మాసనం ఏర్పాటయింది. ఈ వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న వందలాది మంది న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్‌ చంద్రచూడ్‌ మాట్లాడుతూ ‘‘మనమందరం యాత్రికులుగా ఇక్కడకు వచ్చాం. ఎందరో గొప్ప న్యాయమూర్తులు తర్వాతితరం వారికి వారసత్వాన్ని అందించి వెళ్లారు. దాన్ని కొనసాగించాలి’’ అని అన్నారు. తెలుగువాడైన జస్టిస్‌ నరసింహ మాట్లాడుతూ ‘నేను, జస్టిస్‌ చంద్ర చూడ్‌ ముందు న్యాయవాదిగా హాజరయ్యా. ఇప్పుడు ఆయనతో పాటు న్యాయమూర్తిగా కూర్చొన్నా. ఇది అసాధారణమైన విషయం’ అని అన్నారు. తదుపరి సీజే జస్టిస్‌ ఖన్నా మాట్లాడుతూ.. ‘చంద్రచూడ్‌ ఇచ్చిన కొన్ని గొప్ప తీర్పుల వల్ల నా పని సులభమైంది. ఆయనలా పనిచేయడం కష్టం’ అని అన్నారు. కాగా, జస్టిస్‌ చంద్రచూడ్‌ 2022 నవంబర్‌ 8న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు.


  • వ్యవస్థపై చిరకాల ముద్ర

సీజేఐగా రెండేళ్ల వ్యవధిలో జస్టిస్‌ చంద్రచూడ్‌ న్యాయవ్యవస్థపై చిరకాల ముద్ర ఉండే నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, తీర్పులు వెలువరించారు. న్యాయ దేవత విగ్రహం కళ్లకు ఉన్న గంతలను, ఆమె చేతిలో కత్తిని తొలగించి రాజ్యాంగాన్ని ఉంచడం ఆయన చేసిన కీలక మార్పుల్లో ఒకటి. సుప్రీంకోర్టుకు ఇచ్చే వేసవి సెలవులను పాక్షిక పనిదినాలుగా ప్రకటించారు. కోర్టు రికార్డులను డిజిటలైజ్‌ చేయడం వంటి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. దాదాపు 500 తీర్పులు చెప్పిన జస్టిస్‌ చంద్రచూడ్‌ కొన్నింటి విషయంలో చరిత్రలో నిలిచిపోతారు. అయోధ్యలో రామమందిరానికి భూమి కేటాయించడం, ఆర్టికల్‌ 370 రద్దు, గే సెక్స్‌ నేరం కాదని చెప్పడం, ఎన్నికల బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రకటించడం, వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కుగా గుర్తించడం, అవివాహితకు కూడా అబార్షన్‌ హక్కు ఆయన వెలువరించిన తీర్పుల్లో అతి ముఖ్యమైనవి.


  • విమర్శలు కూడా..

జస్టిస్‌ చంద్రచూడ్‌ కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా తన ఇంటికి ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఆహ్వానించడం, అయోఽఽధ్య తీర్పు సమయంలో దేవుడిని ప్రార్థించానని ప్రకటించడం చర్చనీయాంశాలయ్యాయి. మొత్తం ప్రైవేటు ఆస్తిని సేకరించే అఽధికారం ప్రభుత్వానికి లేదని తీర్పు ఇస్తూ సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన జస్టిస్‌ కృష్ణయ్యర్‌ను విమర్శించడంతో ఆక్షేపణకు గురయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సాయిబాబాకు హైకోర్టు బెయిల్‌ ఇస్తే రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు దాన్ని రద్దు చేయడంతో జస్టిస్‌ చంద్రచూడ్‌కు మానవ హక్కులపై ఉన్న గౌరవాన్ని ప్రశ్నార్థకం చేసింది. ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి లోయా సహజ మరణం చెందారని ఆయన ఇచ్చిన తీర్పు కూడా వివాదాస్పదమయింది. చంద్రచూడ్‌ హయాంలో కొలీజియం చేసిన అనేక సిఫార్సులను ప్రభుత్వం పక్కన పెట్టినా ప్రశ్నించకపోవడం న్యాయవ్యవస్థ విజ్ఞతను శంకించినట్లయింది. ఎన్నికల బాండ్లు కొనుగోలు చేసిన వారిపై ఈడీ దర్యాప్తు జరిపించాలన్న అభ్యర్థననూ ఆయన తోసిపుచ్చడంపైనా విమర్శలు వచ్చాయి. మొత్తంగా పొగడ్తలు, విమర్శలతో ఆయన పదవీ కాలం ముగిసింది.

Updated Date - Nov 09 , 2024 | 05:19 AM