వేలాది కేజ్రీవాల్‌లు పుట్టుకొస్తారు!
ABN, Publish Date - May 20 , 2024 | 05:23 AM
ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు.
అరెస్టులతో ఆప్‌ను నాశనం చేయలేరు
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ హెచ్చరిక
న్యూఢిల్లీ, మే 19: ఒక్క కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తే భరతమాత వేలాది మంది కేజ్రీవాల్‌లకు జన్మనిస్తుందని ప్రధాని మోదీని ఆమ్‌ఆద్మీపార్టీ (ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హెచ్చరించారు. అరెస్టుల ద్వారా ఆప్‌ను నాశనం చేయలేరని, ఆప్ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది ఒక ఆలోచనాధార అని చెప్పారు. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో బీజేపీ ప్రధాన కార్యాలయం ముట్టడికి కేజ్రీవాల్ శనివారం పిలుపునిచ్చారు.
పార్టీ కీలక నేతలను అరెస్టు చేసి జైలుకు పంపించటం ద్వారా ఆప్‌ను నాశనం చేయాలని మోదీ కుట్ర పన్నారని, అందుకే బీజేపీ హెడ్‌ఆఫీసుకు అందరమూ వస్తామని, తమలో ఎవరినైనా అరెస్టు చేసుకోవచ్చంటూ మోదీకి సవాల్ విసిరారు. ఈ మేరకు బీజేపీ ఆఫీసుకు ఆప్ నేతలు, కార్యకర్తలతో కలిసి కేజ్రీవాల్ ఆదివారం మధ్యాహ్నం తరలివెళ్లారు. వారిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఆప్ వేగంగా ఎదగటాన్ని చూసి మోదీ తట్టుకోలేకపోతున్నారని, పార్టీని నాశనం చేయటానికి ‘ఆపరేషన్ ఝాడూ (చీపురు)’ను ప్రారంభించారన్నారు.
దాంట్లో భాగంగానే తనతోపాటు పార్టీ ముఖ్య నేతలను జైలుకు పంపించారని, మరింత మంది ఆప్ నాయకులను అరెస్టు చేయనున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని తీవ్రమైన సవాళ్లు ఎదురుకానున్నాయని, వాటిని ఎదుర్కోవటానికి ఆప్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు.
పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని, పార్టీ ఆఫీసును కూడా లాక్కొని రోడ్డు మీదికి ఈడుస్తారని.. వాటన్నింటికీ సిద్ధంగా ఉండాలని ఆప్ శ్రేణులకు సూచించారు. నిరసన కార్యక్రమంలో ఆప్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఢిల్లీ మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, స్వాతిమలివాల్‌పై దాడికి సంబంధించి బిభవ్‌కుమార్‌ను ఢిల్లీలోని స్థానిక కోర్టు ఐదు రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సీఎం నివాసంలోని సీసీటీవీ డిజిటల్ వీడియో రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - May 20 , 2024 | 05:24 AM