Rahul Gandhi : రాయ్‌బరేలీతో నాది కుటుంబ బంధం
ABN, Publish Date - May 15 , 2024 | 03:47 AM
రాయ్‌బరేలీ నియోజకవర్గంతో తనకు కుటుంబ బంధం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
పాత ఫొటోలు చూస్తూ రాహుల్ భావోద్వేగం
న్యూఢిల్లీ, మే 14: రాయ్‌బరేలీ నియోజకవర్గంతో తనకు కుటుంబ బంధం ఉందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ నియోజకవర్గానికి రెండు దశాబ్దాల పాటు ఆయన తల్లి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు. మంగళవారం తల్లితో కలిసి పాత ఫొటోలు చూస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
తన అనుభవాలను హిందీలో వివరిస్తూ ట్వీట్ చేశారు. ఆరు నిమిషాల నిడివిగల వీడియోను కూడా జత చేశారు. ‘‘రాయ్‌బరేలీ, అమేఠీ మాకు కేవలం నియోజకవర్గాలు మాత్రమే కాదు. మా కర్మభూమి. వీటి ప్రతి మూలలోనూ మా తరాల అనుభవాలు దాగి ఉన్నాయి. అమ్మతో కలిసి పాత ఫొటోలను చూస్తుంటే నాన్న, నానమ్మ గుర్తుకు వచ్చారు.
సేవ చేయాలన్న సంప్రదాయాన్ని వారు ప్రారంభించారు. అమ్మ, నేను వాటిని కొనసాగిస్తున్నాం. ప్రేమ, నమ్మకం అన్న పునాదులతో నిర్మితమైన ఈ సంబంధం వందేళ్లనాటిది. ఈ బంధం మాకు అన్నీ ఇచ్చింది. అమేఠీ, రాయ్‌బరేలీ ఎప్పుడు పిలిచినా మేం అక్కడ వాలుతాం’’ అని రాహుల్ అందులో పేర్కొన్నారు.
Updated Date - May 15 , 2024 | 03:50 AM