‘అంబేడ్కరే’ 2025 ఎజెండా!
ABN, Publish Date - Dec 25 , 2024 | 04:47 AM
అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
రేపటి బెళగావి వర్కింగ్ కమిటీ భేటీలో కాంగ్రెస్ కార్యాచరణ.. అమిత్‌షా రాజీనామా కోసం ఉద్యమం!
సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’గా నామకరణం
న్యూఢిల్లీ, డిసెంబరు 24: అంబేడ్కర్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజ్యసభలో అవమానించారంటూ పెద్దఎత్తున ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశాన్నే ప్రధాన ఎజెండాగా చేసుకుని 2025లో ఉద్యమించడానికి కార్యాచరణ సిద్ధం చేయాలని గురువారం బెళగావిలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించనుంది. 1924లో మహాత్మాగాంధీ అధ్యక్షతన కర్ణాటకలోని బెళగావిలో జాతీయ కాంగ్రెస్ సదస్సు జరిగి వందేళ్లు గడచిన సందర్భంగా వర్కింగ్ కమిటీ భేటీని అక్కడ ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌కు జరిగిన అవమానాన్ని గట్టిగా జనంలోకి తీసుకెళ్లి ఉద్యమిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, మీడియా-పబ్లిసిటీ విభాగం అధిపతి పవన్ ఖేరా మంగళవారమిక్కడ విలేకరులకు తెలిపారు. గురువారంనాటి సమావేశానికి ‘నవ సత్యాగ్రహ బైఠక్’ అని నామకరణం చేసినట్లు జైరాం వెల్లడించారు.
తమ పార్టీ ఈ వారాన్ని ‘అంబేడ్కర్ సమ్మాన్ సప్తా్‌హ’గా పాటిస్తున్నట్లు తెలిపారు. అమిత్‌షాను హోం మంత్రిగా తొలగించడం.. ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడమే ఈ సమస్యకు ఏకైక పరిష్కారమన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని ప్రధాని మోదీ, బీజేపీ భావిస్తున్నారని.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్‌కు జరిగిన అవమానంపై ఏం చేయాలి.. భవిష్యత్‌లో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో వర్కింగ్ కమిటీ భేటీలో లోతుగా చర్చిస్తామని వేణుగోపాల్ చెప్పారు. అమిత్‌షా రాజీనామాను డిమాండ్ చేస్తూ.. మంగళవారం దేశవ్యాప్తంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలు ప్రదర్శనలు నిర్వహించి కలెక్టర్ల ద్వారా రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించాయన్నారు. గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు నవ సత్యాగ్రహ బైఠక్ ప్రారంభమవుతుందన్నారు. మర్నాడు 27న బెళగావిలోనే ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ర్యాలీ జరుగుతుందని.. ఇందులో లక్షలమంది కార్యకర్తలు, ఎంపీలు, ఏఐసీసీ సభ్యులు పాల్గొంటారని తెలిపారు.
Updated Date - Dec 25 , 2024 | 04:47 AM