PM Modi: చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ వేళ ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Oct 31 , 2024 | 10:00 PM
భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడబోమని ఆయన వ్యాఖ్యానించారు.
కచ్: భారత్-చైనా సరిహద్దులో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న కేంద్ర ప్రభుత్వం దేశానికి సంబంధించిన ఒక్క అంగుళం భూమి విషయంలో కూడా రాజీపడబోమని ఆయన వ్యాఖ్యానించారు. “21వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మనం మన సైన్యాలను, మన భద్రతా దళాలను ఆధునిక వనరులతో బలోపేతం చేసుకుంటున్నాం. ప్రపంచంలో అత్యాధునిక సైన్యాల జాబితాలో చేర్చుతున్నాం. ఈ ప్రయత్నాలకు ఆధారం రక్షణ రంగంలో స్వావలంబన’’ అని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్‌లోని కచ్ఛ్‌లో ఉన్న సర్ క్రీక్ ప్రాంతంలోని లక్కీ నాలా వద్ద బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, వైమానిక దళ సిబ్బందితో ఇవాళ (గురువారం) ఆయన దీపావళిని జరుపుకున్నారు. ‘‘నేడు అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడమే లక్ష్యంగా వేగంగా ముందుకు సాగుతున్న వేళ మీరందరూ (సైనికులు) ఈ కలల రక్షకులు’’ అని మోదీ అన్నారు.
కాగా తూర్పు లడఖ్ దగ్గర చైనా-భారత్ బలగాల ఉపసంహరణ ప్రక్రియ దాదాపు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సరిహద్దు పర్యాటకం జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని, దీని గురించి పెద్దగా చర్చించలేదని మోదీ అన్నారు.
కచ్‌లో మోదీ దీపావళి..
ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా దీపావళి పండగను సైనికుల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఈ రోజు (గురువారం) గుజరాత్‌లోని కచ్ఛ్‌లో సర్ క్రీక్‌లోని లక్కీ నాలా వద్ద బీఎస్‌ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని కలిశారు. ఆర్మీ యూనిఫాం ధరించి సైనికులతో గడిపారు. అక్కడున్న సైనికులకు ఆయన పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సైనికులకు స్వీట్లు పంచిపెట్టారు.