Coldest Day: రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. ఈ సీజన్‌లోనే..
ABN, Publish Date - Jan 10 , 2024 | 10:41 AM
ఉత్తర భారతదేశానికి శీతాకాలం చుక్కలు చూపిస్తోంది. తీవ్ర చలితో ఉత్తర భారతదేశం మొత్తం వణికిపోతోంది. దీంతో ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకి రాలేకపోతున్నారు.
ఢిల్లీ: ఉత్తర భారతదేశానికి శీతాకాలం చుక్కలు చూపిస్తోంది. తీవ్ర చలితో ఉత్తర భారతదేశం మొత్తం వణికిపోతోంది. దీంతో ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. చలికి తోడు మంచు కూడా కురుస్తుండడంతో తెల్లవారాక కూడా చీకట్లు కమ్ముంటున్నాయి. దీంతో రోడ్లపై ప్రయాణించే వాహనదారులకు సమస్యలు తప్పడం లేదు. మంచు కారణంగా రోడ్డు కనిపించక పలు చోట్ల ప్రమాదాలు కూడా జరిగాయి. తీవ్ర చలి, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఢిల్లీలో ఈ శీతకాలంలో మంగళవారం అత్యంత శీతల రోజుగా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఆరు డిగ్రీలు తక్కువని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధానిలో బుధవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు తెలిపింది.
దీంతో బుధవారం నాడు ఢిల్లీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో గాలి నాణ్యత కూడా దెబ్బతింది. ఉత్తరప్రదేశ్‌లోనూ ఉష్ణోగ్రతలు బాగా క్షీణించాయి. కాన్పూర్, ఆగ్రాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్, 1.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. తీవ్ర చలి వాతావరణం కారణంగా నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడానికి ఢిల్లీలో నైట్ షెల్టర్లు ఏర్పాటుచేశారు. ఈ షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న వారికి దుప్పట్లు, బెడ్‌లు, వేడినీరు, ఆహారం అందిస్తున్నారు. ఈ నెల 14 వరకు పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ డివిజన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర రాజస్థాన్‌లలో ఉదయం కొన్ని గంటల పాటు దట్టమైన పొగమంచు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం మధ్యప్రదేశ్, ఒడిషా, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 12 వరకు ఉత్తరాఖండ్‌లో పొగమంచు మంచు పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. అలాగే రాబోయే 48 గంటల్లో ఉష్ణోగ్రతల్లో పెదగా మార్పులు కూడా ఉండవని తెలిపింది. అయితే రానున్న మూడు రోజులు తమిళనాడు, కేరళ, కోస్తా కర్ణాటక, లక్షద్వీప్ దీవుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Updated Date - Jan 10 , 2024 | 10:44 AM