Delhi : సిసోడియాకు బెయిల్
ABN, Publish Date - Aug 10 , 2024 | 05:37 AM
మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది.
17నెలల తర్వాత ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు ఊరట
విచారణ లేకుండా ఎంత కాలం జైల్లో ఉంచుతారు?
ఆయన ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడమే
బెయిల్ నిబంధన.. జైలు మినహాయింపు: సుప్రీంకోర్టు
ఢిల్లీ మద్యం కేసు విచారణలో తీవ్ర జాప్యమే
బెయిల్ ఇవ్వడానికి కారణమన్న ధర్మాసనం
త్వరలోనే కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్?
న్యూఢిల్లీ, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఎట్టకేలకు బెయిలు లభించింది. 17 నెలలుగా తిహాడ్ జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితుల్లో సిసోడియాను శాశ్వతంగా జైల్లో ఉంచలేమని, ఇది ఆయన ప్రాథమిక హక్కులకు భంగకరమని స్పష్టం చేసింది. జైల్లో పెట్టడం కంటే బెయిల్ ఇవ్వడం కనీస న్యాయసూత్రం అని పేర్కొంది.
బెయిల్ ఇవ్వకుండా నెలల తరబడి సాగదీయడం శిక్షగా పరిణమించకూడదంటూ దిగువ కోర్టు, హైకోర్టులను సుప్రీం ధర్మాసనం మందలించింది. బెయిల్ అనేది నిబంధన, జైలు అనేది మినహాయింపు కావాలని జస్టిస్ గవాయ్ అన్నారు. ఈ కేసులో దాదాపు 493 మందిని సాక్షులుగా పేర్కొన్నారని, సమీప భవిష్యత్తులో సిసోడియాపై విచారణ పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
సిసోడియాపై దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజును ప్రశ్నించగా.. కేసులో చార్జిషీటు దాఖలైన నెల రోజుల్లో విచారణ ప్రారంభమవుతుందని చెప్పారు. కేసు విచారణలో జాప్యానికి నిందితులే కారణమని, వారిని విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తారని తెలిపారు. అయితే సాక్ష్యాలన్నీ డాక్యుమెంట్లలోనే ఉన్నప్పుడు, వాటిని ఎలా తారుమారు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.
ఆయన బెయిలును గత ఏప్రిల్‌లో రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించగా, సాక్షులను ప్రభావితం చేస్తారన్న కారణంగా మేలో ఢిల్లీ హైకోర్టు కూడా నిరాకరింంచింది. జూన్‌లో సుప్రీంకోర్టు సైతం బెయిల్ నిరాకరించింది. కాగా, సిసోడియా సచివాలయానికి వెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలన్న ఈడీ, సీబీఐ అభ్యర్థనను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. పారిపోవడం, సాక్షులను ప్రభావితం చేయడం, సాక్ష్యాలను తారుమారు చేయడమనే కారణాలు సిసోడియాకు వర్తించవని పేర్కొంది.
మనీలాండరింగ్ కేసులో ఆయనపై విచారణలో మితిమీరిన జాప్యమే ఈ బెయిల్ ఇచ్చేందుకు కారణమని ధర్మాసనం తెలిపింది. 2023 ఫిబ్రవరి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా, ఆ తర్వాత రెండు వారాలకు ఈడీ కూడా అరెస్టు చేసింది. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఢిల్లీ మద్యం కేసులో... రూ.10 లక్షల పూచీకత్తు సమర్పించాలని, పాస్‌పోర్టును దర్యాప్తు అధికారులకు అప్పగించాలని, ఢిల్లీ వదిలి వెళ్లరాదని, ప్రతి సోమ, గురువారాల్లో రెండుసార్లు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని సిసోడియాకు షరతులు విధించింది. శుక్రవారం సాయంత్రం సిసోడియా జైలు నుంచి విడుదలయ్యారు.
కేజ్రీవాల్, కవితకూ మార్గం సుగమం..?
సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిలు ఇవ్వడంతో ఇదే కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు. కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ లభించిన విషయం తెలిసిందే. దిగువ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేజ్రీవాల్‌కు ఈడీ కేసులో బెయిల్ లభించినప్పటికీ సీబీఐ ఆయన్ను మళ్లీ అరెస్టు చేసింది. ఇక ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ ఇప్పటికే పెండింగ్‌లో ఉందని, వచ్చే వారం ఈ పిటిషన్ విచారణకు రానుందని బీఆర్‌ఎస్ న్యాయ వర్గాలు తెలిపాయి.
Updated Date - Aug 10 , 2024 | 05:37 AM