RG Kar Medical College: ప్రొ. సందీప్ ఘోష్ నివాసంలో ఈడీ సోదాలు
ABN, Publish Date - Sep 12 , 2024 | 10:01 AM
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది.
కోల్‌కతా, సెప్టెంబర్ 12: ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొ. సందీప్ ఘోష్ నివాసంతోపాటు మరో రెండు ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం సోదాలు నిర్వహించింది. ప్రొ. సందీప్ ఘోష్‌కు చెందిన రెండు ప్లాట్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. అలాగే లేక్ టౌన్‌లోని మెడికల్ సప్లయర్ కార్యాలయంతోపాటు తాలాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి మందులు సరఫరా చేసిన వ్యక్తి నివాసంలో సైతం సోదాలు నిర్వహించింది. ఇప్పటికే ఇదే విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, సోనార్‌పూర్, హుగ్లీలలో ఈడీలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలు జరిగిన కొద్ది రోజులకే ప్రొ. సందీప్ ఘోష్ నివాసాలతోపాటు ఇతర ప్రాంతాల్లో సైతం ఈడీలు సోదాలు నిర్వహించింది.
గత నెలలో ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. హత్యాచారం జరిగిన ట్రైయినీ వైద్యురాలు తన కుమార్తెతో సమానమన్నారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకూడదంటూ ఆయన తన ఎక్స్ ఖాతా వేదికా స్పందించారు.
ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొ. సందీప్ ఘోష్ హయాంలో భారీ అవినీతి చోటు చేసుకుందని ఆ ఆసుపత్రి మాజీ డిప్యూటీ సుపరింటెండెంట్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రొ. సందీప్ ఘోష్‌ను కొన్ని వారాల క్రితం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. 2021లో ఆర్ జీ కర్ ఆసుపత్రి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ప్రొ. సందీప్ ఘోష్ బాధ్యతలు చేపట్టారు.
నాటి నుంచి ఆయన హయాంలో చోటు చేసుకున్న మందుల కొనుగోళ్లు ఇతర అంశాలపై ఈడీ విచారణ చేపట్టింది. అందులోభాగంగా ఆయా అంశాలపై ఈడీ ఆరా తీస్తుంది. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రి ప్రిన్సిపాల్ పదవికి ప్రొ. సందీప్ ఘోష్ రాజీనామా చేసిన వెంటనే ఆయనను మరో కాలేజీ ప్రిన్సిపల్‌గా మమతా బెనర్జీ ప్రభుత్వం నియమించింది. ఈ విషయాన్ని కోల్‌కతా హైకోర్టు సైతం తప్పు పట్టింది. ప్రొ. సందీప్ ఘోష్‌ను దీర్ఘ కాలిక సెలవుపై పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Read More National News and Latest Telugu New
Updated Date - Sep 12 , 2024 | 10:01 AM