Fact Check: రాహుల్ గాంధీనే నెక్ట్స్ ప్రధాని.. షారుఖ్ ట్వీట్ వెనుక అసలు కథ ఇది!
ABN, Publish Date - May 30 , 2024 | 05:43 PM
సార్వత్రిక ఎన్నికలు తుది దశకు చేరుకున్న తరుణంలో.. ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధాని అయ్యేది ఎవరు? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొందరేమో మూడోసారి కూడా...
సార్వత్రిక ఎన్నికలు (Lok Sabha Polls 2024) తుది దశకు చేరుకున్న తరుణంలో.. ఈసారి కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ప్రధాని అయ్యేది ఎవరు? అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. కొందరేమో మూడోసారి కూడా నరేంద్ర మోదీనే (Narendra Modi) ప్రధాని అవుతారని అంటుంటే, మరికొందరేమో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈసారి ప్రధాని పీఠం ఎక్కుతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ ట్వీట్
ఇలాంటి తరుణంలో.. సోషల్ మీడియాలో ఒక ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. భారతదేశానికి కాబోయే తదుపరి ప్రధాని రాహుల్ గాంధీనే అని.. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) ట్వీట్ చేసినట్లు ఒక పోస్టు తెగ చక్కర్లు కొడుతోంది. షారుఖ్ నిజంగానే ఆ ట్వీట్ చేశాడా? లేదా? అనేది ఏమాత్రా నిర్ధారించుకోకుండానే చాలామంది దాన్ని షేర్ చేస్తున్నారు. షారుఖ్ అధికారిక ఎక్స్ ఖాతా తరహాలోనే అందులో ప్రొఫైల్ ఫోటో, బ్లూటిక్, బ్యానర్ ఉండటం చూసి.. అతను ఈ ట్వీట్ నిజంగానే చేసి ఉంటాడన్న నమ్మకంతో.. స్క్రీన్‌షాట్‌ని నెటిజన్లు షేర్ చేయడం జరిగింది. చివరికి షారుఖ్ కూడా నెక్ట్స్ ప్రధాని రాహుల్ గాంధీనే అవుతారని జోస్యం చెప్పేశారని పోస్టులు పెడుతున్నారు.
పీటీఐ ఫ్యాక్ట్ చెక్
ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవ్వడంతో.. పీటీఐ ఫ్యాక్ట్ చెక్ డెస్క్ ఆ ట్వీట్‌ని నిశితంగా పరిశీలించింది. షారుఖ్ నిజంగా ఆ ట్వీట్ చేశాడా? లేదా? అనేది పరిశీలించి.. ఫైనల్‌గా అదొక ఫేక్ ట్వీట్ అని తేల్చింది. అసలు రాహుల్‌పై షారుఖ్ ఎలాంటి పోస్టు పెట్టలేదని, ఎవరో దానిని సృష్టించి వైరల్ చేశారని వెల్లడించింది. పోనీ షారుఖ్ ఆ ట్వీట్ చేసి డిలీట్ చేశాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేయగా.. అలాంటి యాక్టివిటీ కూడా కనుగొనబడలేదు. దీంతో.. ఈ ట్వీట్ ఫేక్ అని పీటీఐ తేల్చింది. షారుఖ్ చివరిసారిగా తన కేకేఆర్ జట్టు గురించి మాత్రమే ఓ ట్వీట్ చేశాడని తన దర్యాప్తులో తేల్చిన పీటీఐ.. రాహుల్‌పై ఎలాంటి కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్ సమయంలో.. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ మే 18న షారుఖ్ ఓ ట్వీట్ చేశాడు. అంతే తప్ప.. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఎలాంటి ట్వీట్ చేయలేదని వెల్లడైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సహకారంతో.. ఎవరో ఈ ఫేక్ ట్వీట్ చేసి వైరల్ చేశారని పీటీఐ వెల్లడించింది. షారుఖ్ ఇమేజ్‌ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే.. ఎవరో కావాలనే ఈ ట్వీట్‌ని సృష్టించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read Latest National News and Telugu News
Updated Date - May 30 , 2024 | 05:43 PM