తాజ్‌మహల్ సమీపంలోని పార్కు ఓ రైతు స్వాధీనంలోకి!
ABN, Publish Date - Nov 06 , 2024 | 04:31 AM
ఆగ్రాలో మెహతాబ్ బాగ్ సమీపంలోని గ్యారహ్ సీదీ పార్క్ నుంచి తాజ్‌మహల్ అందాలను చూస్తుంటే కనుల విందుగా ఉంటుంది.
40 ఏళ్ల న్యాయ పోరాటంలో గెలిచానని
వెల్లడి..చుట్టూ కంచె ఏర్పాటు
ఆగ్రా, నవంబరు 5: ఆగ్రాలో మెహతాబ్ బాగ్ సమీపంలోని గ్యారహ్ సీదీ పార్క్ నుంచి తాజ్‌మహల్ అందాలను చూస్తుంటే కనుల విందుగా ఉంటుంది. అదే సూర్యాస్తమయం సమయంలో అయితే వాహ్ తాజ్! అనేలా సీన్ ఉంటుంది. దీంతో ఆ ప్రాంతం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే యమునా నది ఒడ్డున ఉండే ఈ గ్యారహ్ సీదీ పార్క్ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ పార్కులోని కొంత భూమి తనదని, తన పూర్వీకుల ఆస్తి అని, 40 ఏళ్ల పాటు సాగిన న్యాయ పోరాటంలో తాను గెలిచానని పేర్కొంటూ మున్నా లాల్ అనే స్థానిక రైతు.. ఆ పార్కులోకి పర్యాటకులు రాకుండా నిషేధించాడు. తనదని చెబుతున్న 6 బిగాల (దాదాపు 2.4 ఎకరాలు) భూమిని తన నియంత్రణలోకి తీసుకొని, చుట్టూ కంచె వేసేశాడు.
ఈ భూమిపై కొన్ని తరాల నుంచి తమకు హక్కు ఉందని, తన తండ్రి, బాబాయిలు ఇందులో సాగు కూడా చేశారని కచ్‌పురాకు చెందిన మున్నాలాల్ చెబుతున్నాడు. వాళ్ల పేర్లు భూపత్రాల్లో కూడా ఉన్నాయని పేర్కొన్నాడు. అయితే తాజా వివాదంపై ఆగ్రా డివిజనల్ కమిషనర్ రితూ మహేశ్వరి స్పందిస్తూ.. వివాదంలోని భూమి ఆగ్రా డెవల్‌పమెంట్ అథారిటీ(ఏడీఏ) పరిధిలోకి వస్తుందని చెప్పారు. తాజా పరిణామాలపై విచారణ కొనసాగుతోందని చెప్పారు.
Updated Date - Nov 06 , 2024 | 04:31 AM