Former CM: మమ్మల్ని విచ్ఛిన్నం చేయాలనుకొనేవారు గాల్లో కొట్టుకుపోతారు..
ABN, Publish Date - Apr 14 , 2024 | 12:39 PM
అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయాలనుకొనేవారు గాల్లో కొట్టుకుపోతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) ఘాటుగా సమాధానమిచ్చారు.
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి
చెన్నై: అన్నాడీఎంకేను విచ్ఛిన్నం చేయాలనుకొనేవారు గాల్లో కొట్టుకుపోతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీసీఎం ఎడప్పాడి పళనిస్వామి(Former CM Edappadi Palaniswami) ఘాటుగా సమాధానమిచ్చారు. చిదంబరం లోక్‌సభ అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా శనివారం సాయంత్రం అరియలూరులో జరిగిన ప్రచార సభలో పళనిస్వామి మాట్లాడుతూ... దేశంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా అన్నాడీఎంకే(AIADMK) ఉందన్నారు. అలాంటి పార్టీని విచ్ఛిన్నం చేస్తామని పలువురు పేర్కొంటున్నారని, జూన్ 4 తర్వాత ఎవరు కనిపించకుండా పోతారో తెలుస్తుందన్నారు. మమ్మల్ని బెదిరించే పనులు చేపట్టవద్దని హితవు పలికారు. అదే సమయంలో పార్టీని చిన్న చూపు చూడొద్దని, అలా చూసిన వారిని 2 కోట్ల మంది కార్యకర్తలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రజలకు మేలుచేసే పథకాలు అమలు చేస్తే స్వాగతిస్తామని, అదే సమయంలో ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు. రాష్ట్రప్రజల సంక్షేమం కోసమే తాము బీజేపీ కూటమి నుండి వైదొలిగామన్నారు.
మూడేళ్ల డీఎంకే పాలనలో ప్రజలను పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుతం ఎన్నికలు వస్తుండడంతో ముఖ్యమంత్రి ఊరూరా తిరుగుతూ దుకాణాల్లో టీ తాగడం, మార్నింగ్ వాక్ చేపట్టడం తదితరాలు చేస్తూ ఫొటోలకు ఫోజులిస్తున్నారన్నారు. రాష్ట్రంలో గంజాయి దొరకని ప్రదేశమే లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు బీజేపీ ప్రభుత్వం పాల్పడితే వాటిని ఎదుర్కొనే సత్తా అన్నాడీఎంకేకు ఉందన్నారు. కూటములను నమ్మి తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రజలను నమ్మి పోటీ చేస్తున్నామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని పళనిస్వామి తెలిపారు. అన్నాడీఎంకే పగ్గాలు దినకరన్ చేతికి వస్తాయంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత జయకుమార్ తీవ్రంగా స్పందించారు. తమ పార్టీని హస్తగతం చేసుకోవడం వారి తరం కాదని బదులిచ్చారు. రాజకీయాల్లో అన్నామలై బచ్చా అని, అతని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
ఇదికూడా చదవండి: Amit Shah: సనాతన ధర్మాన్ని అవమానిస్తారా.. డీఎంకే నేతలపై అమిత్‌షా ఆగ్రహం
Updated Date - Apr 14 , 2024 | 12:39 PM