MUDA Case: సీఎం మిస్టర్ క్లీన్.. పై కోర్టులకు వెళ్తాం
ABN, Publish Date - Sep 24 , 2024 | 02:41 PM
'ముడా' భూముల కేటాయింపు కుంభకోణంలో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంపై ఆ రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. ఆయన ఎలాంటి మచ్చా లేని ముఖ్యమంత్రి అని అన్నారు.
బెంగళూరు: 'ముడా' (MUDA) భూముల కేటాయింపు కుంభకోణంలో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంపై ఆ రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. సీఎం రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆయన ఎలాంటి మచ్చా లేని ముఖ్యమంత్రి అని అన్నారు. సిద్ధరామయ్యకు అండగా మంత్రివర్గం, కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని చెప్పారు.
''ఆయన నూటికి నూరు శాతం క్లీన్ హ్యాండ్ చీఫ్ మినిస్టర్. దేశంలోనే అత్యంత అవనీతిపరులు బీజేపీ వాళ్లే. వాళ్ల మాటలకు ఎలాంటి విలువా లేదు. సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని ఏకసభ్య బెంచ్ ఇప్పుడు సమర్ధించింది. ద్విసభ్య బెంచ్ ఉంది, ఫుల్ బెంచ్ ఉంది, సుప్రీంకోర్టు ఉంది. మేము పోరాడతాం. సిద్ధరామయ్య రాజీనామాను కోరే నైతిక హక్కు బీజేపీకి లేదు. కాంగ్రెస్ మాత్రమే కాదు, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు, అధిష్ఠానవర్గం ఆయనకు అండగా నిలుస్తుంది. ఆయన ఎందుకు రాజీనామా చేయాలి? యడియూరప్ప, కుమారస్వామిపై డీనోటిఫికేషన్ కేసు ఉంది. ముందు వాళ్లను రాజీనామా చేయమనండి'' అని రామలింగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
సీఎం రాజీనామాకు బీజేపీ డిమాండ్
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కేసుపై హైకోర్టు మంగళవారంనాడు తీర్పును వెలువరిస్తూ గవర్నర్ ఈ కేసును చట్ట ప్రకారం విచారించవచ్చని తెలిపింది. జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించింది. గవర్నర్ ఉత్తర్వు మేరకు ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలన్నారు. గవర్నర్ చర్యలో ఎలాంటి లోపం లేదన్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో సిద్ధరామయ్య రాజీనామా చేయాలని బీజేపీ నేత సీటీ రవి డిమాండ్ చేశారు. చట్టం ఎవరికైనా ఒకటేనని, కర్ణాటక హైకోర్టు తీర్పుతోనైనా సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ప్రతి అవినీతి నేత తాను రాజీనామా చేయనని చెబుతుంటారని, సిద్ధరామయ్య అవినీతి నేత అని ఘాటుగా విమర్శించారు.
Read More National News and Latest Telugu News
ఇవి కూడా చదవండి:
NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Updated Date - Sep 24 , 2024 | 02:41 PM