Kalpana meets Sunita: ఇద్దరి ఫేట్ ఒకేమాదిరి.. ఆ ఇద్దరూ కలుసుకున్నారు
ABN , Publish Date - Mar 30 , 2024 | 06:19 PM
జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారంనాడు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ను కలుసుకున్నారు. సోనియాగాంధీని సైతం కలుస్తున్నట్టు కల్పనా సోరెన్ తెలిపారు.
న్యూఢిల్లీ: జార్ఖాండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ (Kalpana Soren) శనివారంనాడు న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ (Sunita Kejriwal)ను కలుసుకున్నారు. అనంతరం మీడియాతో కల్పనా సోరెన్ మాట్లాడుతూ, రెండు నెలల క్రితం జార్ఖాండ్‌లో ఏదైతే జరిగితో అదే ఘటన ఇప్పుడు ఢిల్లీలో పునరావృతమైందనీ, సునీతా కేజ్రీవాల్ బాధను పంచుకునేందుకు ఇక్కడకు వచ్చానని తెలిపారు. కలిసికట్టుగా తాము పోరాటం సాగిస్తామని, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కూడా ఈరోజు కలుసుకోంటానని ఆమె చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 21న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మార్చి 28 వరకూ ఆయనను విధించిన ఈడీ కస్టడీని తిరిగి ఏప్రిల్ 1 వరకూ కోర్టు పొడిగించింది. కేజ్రీవాల్ అరెస్టుపై పోరాటం సాగించేందుకు 'కేజ్రీవాల్ కో ఆశీర్వాద్' వాట్సాప్ ప్రచారానికి సునీతా కేజ్రీవాల్ శ్రీకారం చుట్టారు. కాగా, అక్రమ మైనింగ్ ఆరోపణలపై జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను రెండు నెలల క్రితం ఈడీ అరెస్టు చేయగా, అరెస్టుకు ముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేసారు. తప్పుడు కేసులతో ఈడీ తన భర్తను అరెస్టు చేసిందని, ప్రజాసేవ కోసం తన భర్త సాగిస్తున్న పోరాటాన్ని తాను కొనసాగిస్తానని కల్పనా ప్రకటించారు. ఈ క్రమంలో కల్పనా సోరెన్, సునీతా కేజ్రీవాల్ కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.