Share News

Kalpana Soren: జార్ఖండ్ సీఎంగా సోరేన్ భార్య..? అసలు ఏం జరుగుతోందంటే..

ABN , Publish Date - Jan 02 , 2024 | 05:52 PM

Kalpana Soren: మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌పై ఈడీ విచారణ కొనసాగుతుండటంతో ఆయన ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు డిసెంబర్ 30న సోరెన్‌కు ఈడీ సమన్లు కూడా జారీ చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేసి.. తన భార్య కల్పన సోరెన్‌ను సీఎంగా నియమించవచ్చని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె అభిప్రాయపడ్డారు.

Kalpana Soren: జార్ఖండ్ సీఎంగా సోరేన్ భార్య..? అసలు ఏం జరుగుతోందంటే..

జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబరులో జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలకు 11 నెలల ముందే ఆ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ఎందుకంటే జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్ఛా) పార్టీ ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గాండే నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగడం అనివార్యంగా మారింది. గతంలో కాంగ్రెస్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2019లో జేఎంఎంలో చేరారు. 2019లో గాండే నియోజకవర్గం నుంచి జేఎంఎం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నికల్లో ఆ సీటును గెలుచుకోవాలని జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ప్రయత్నిస్తున్నారు.

అయితే ఇప్పటికే హేమంత్ సోరెన్ కుటుంబ సభ్యుల్లో పలువురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఆయన సోదరుడు బసంత్ సోరెన్ దుమ్కా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, ఆయన కోడలు సీతా సోరెన్ జామా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి సీఎం హేమంత్ సోరెన్‌పై ఈడీ విచారణ కొనసాగుతుండటంతో ఆయన ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు డిసెంబర్ 30న సోరెన్‌కు ఈడీ సమన్లు కూడా జారీ చేసింది. దీంతో ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేసి.. తన భార్య కల్పన సోరెన్‌ను సీఎంగా నియమించవచ్చని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబె అభిప్రాయపడ్డారు.

కానీ కల్పన సోరెన్ సీఎం కావాలంటే ఆమె అసెంబ్లీ నుంచి శాసన సభ లేదా శాసన మండలి నుంచి ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి. ఒకవేళ కల్పన సోరెన్‌ను సీఎంగా నియమిస్తే అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ఆరు నెలల సమయం ఉంటుంది. ప్రస్తుతం గాండే నియోజకవర్గం ఖాళీ కావడంతో త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో గాండే నుంచి కల్పన సోరెన్ పోటీ చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ఇంకా 11 నెలల సమయం ఉండటంతో కల్పన సోరెన్ సీఎంగా కొనసాగాలంటే కచ్చితంగా శాసన సభ నుంచి ఎన్నిక కావాల్సిన పరిస్థితుల్లో ఉపఎన్నికలో పోటీ చేసి విజయం సాధించడమే ఆమె ముందు ఉన్న సవాల్‌గా కనిపిస్తోంది. గతంలో యూపీ సీఎంగా ఎన్నికైన అఖిలేష్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్ కూడా ఆ తర్వాత శాసన సభ లేదా శాసన మండలి నుంచి ఎన్నికయ్యారు. కాగా గాండే ఉపఎన్నిక నేపథ్యంలో హేమంత్ సోరెన్ వర్గం ఆందోళనలో ఉంది. దీంతో ఈ వారంలో జేఎంఎం శాసనసభాపక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత సీఎం పదవికి సోరెన్ రాజీనామా చేసి ఆ లేఖను గవర్నర్‌కు సమర్పిస్తారని.. న్యాయసలహా తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటారని బీజేపీ ఎంపీ దూబె మీడియాకు వివరించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 02 , 2024 | 06:06 PM