ఉత్తరాఖండ్‌లో ఘోరం
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:40 AM
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది.
200 మీటర్ల లోయలో పడిన బస్సు
36 మంది దుర్మరణం.. నలుగురు విషమం
24 మందికి గాయాలు.. హెలికాప్టర్‌లో ఆస్పత్రికి
అధిక భారం వల్లే ప్రమాదం: పోలీసులు
మర్చులా (ఉత్తరాఖండ్), నవంబరు 4: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 60 మందితో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 36 మంది దుర్మరణం పాలవగా.. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో సోమవారం ఉదయం 8 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గర్వాల్ ప్రాంతంలోని పౌరి నుంచి ఆదివారం రాత్రి ఈ బస్సు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమావున్‌లోని రామ్‌నగర్‌కు బయల్దేరింది. మరో 35 కి.మీ. ప్రయాణిస్తే గమ్యం చేరుకుంటుందనగా.. అల్మోరాలోని మర్చులా ప్రాంతంలో అదుపుతప్పి 200 మీటర్ల లోయలో పడిపోయింది. దీంతో ప్రయాణికులను బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ బస్సు సీటింగ్ సామర్థ్యం 43 మందే. కానీ.. ప్రమాద సమయంలో దీనిలో 60 మంది ఉన్నారు. ఓవర్‌లోడ్ కారణంగానే బస్సు అదుపుతప్పి లోయలో పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. క్షతగాత్రులను రామ్‌నగర్‌లోని ఆస్పత్రికి తలరించారు. తీవ్రంగా గాయపడిన నలుగురిలో ముగ్గురిని హెలికాప్టర్ ద్వారా రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తరలించగా.. ఒకరిని హల్ద్వానీలోని సుశీలా తివారీ ఆస్పత్రికి పంపినట్టు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులను గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఆర్థిక సాయం ప్రకటించిన ప్రధాని మోదీ
ఈ ప్రమాద వార్త తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు, గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున అందిస్తామని ప్రకటించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ బస్సులో ఉన్నవారిలో ఎక్కువ మంది దీపావళికి స్వగ్రామాలకు చేరుకుని.. సెలవులు ముగియగానే తిరిగి విధుల్లో చేరేందుకు ఆదివారం రాత్రి బస్సు ఎక్కారు.
Updated Date - Nov 05 , 2024 | 03:40 AM